
సినీ జీవితంలో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఇళయరాజా పేరును భారతరత్న పురస్కారం కోసం ప్రతిపాదించనున్నట్లు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ తెలిపారు. అనంతరం ఆయన్ను జ్ఞాపికతో సీఎం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్, రజనీకాంత్, కమల్ హాసన్, కార్తి వంటి స్టార్స్ పాల్గొన్నారు.
ఇళయరాజా తన 50ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో ఒడిదిడుకులు చూశారని సీఎం స్టాలిన్ అన్నారు. కృషి ఉంటే ఎంతటి ఉన్నత శిఖరానికైనా చేరవచ్చని ఇళయరాజా జీవితం చెబుతుందన్నారు. ఆయన సంగీతం విజయ ప్రస్థానానికి ప్రేరణ అందించడమే కాకుండా బాధలను కూడా ఓదార్చుతోందని సీఎం తెలిపారు. సంగీత కళాకారులను ప్రోత్సహించేందుకు ఏటా తమిళనాడు ప్రభుత్వం తరఫున ఇళయరాజా పేరుతో ఒక పురస్కారం అందిస్తామని స్టాలిన్ ప్రకటించారు.
SP బాలు, ఇళయరాజా వివాదంపై రజనీ వ్యాఖ్యలు
'ఇళయరాజా పాటలు నేడు చాలా సినిమాల్లో ఉపయోగిస్తున్నారని రజనీకాంత్ అన్నారు. దీంతో పలు సినిమా మేకర్స్‌పై కాపీరైట్ చట్టం ప్రకారం ఆయన కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా ఆయనకు అనుకూలంగానే తీర్పు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇళయరాజా తను స్వరపరచిన పాటలపై కాపీరైట్ హక్కులు తనకే ఉన్నాయని.. ఎస్.పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఆ పాటలు మళ్లీ పాడకూడదని కోరారు. దీంతో బాలు కూడా మళ్లీ ఎక్కడా ఆ పాటలు పాడలేదు. కానీ, కోవిడ్ సమయంలో SPB మరణించినప్పుడు, ఇళయరాజా కన్నీళ్లు పెట్టుకున్నారు. అందరి ముందే విలవిల ఏడ్చారు. గతంలో తన సోదరుడు, కూతురు, భార్య మరణించిన సమయంలో కూడా ఆయన కన్నీళ్లు పెట్టలేదు. కానీ బాలు కోసం ఏడ్చేశారు. వారి మధ్య స్నేహం ఎంత బలమైనదో ఇదొక్కటి చాలు.' అని రజనీకాంత్ అన్నారు.