రోషన్, అనస్వర రాజన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘చాంపియన్ ’. జీ స్టూడియోస్ సమర్పణలో ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్, స్వప్న సినిమాస్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈ చిత్రం సంగీతదర్శకుడు మిక్కీ జే మేయర్(Mickey J Meyer) మాట్లాడుతూ – ‘‘స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కథతో ‘చాంపియన్’ సినిమా రూపొందింది. ఈ తరహా సినిమాలకు సంగీతం అందించడం నాకు ఇలా ఇష్టం. ఎందుకంటే ఒక టైమ్ నుంచి మరో టైమ్‌లోకి వెళ్లి మరో కాలాన్ని చూడడమనేది ఆసక్తికరంగా ఉంటుంది.
‘మహానటి’ సినిమా నాకు అలాంటి అనుభూతినే ఇచ్చింది. ‘చాంపియన్’లో నిజాం బ్యాక్‌డ్రాప్ ఉంటుంది. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ‘సల్లంగుండాలి, గిర గిర గిర గింగిరాగిరే..’ పాటలకు మంచి స్పందన లభిస్తోంది. తెలంగాణ జానపదంతో పాటు వెస్ట్రన్ మ్యూజిక్‌ను మిళితం చేసి ఒక జానర్‌ను క్రియేట్ చేసే అవకాశం ఈ కథ కల్పించింది.
ఈ కథలో హీరోకు సికింద్రాబాద్ బ్యాక్‌డ్రాప్ ఉంటుంది. నేను కూడా సికింద్రాబాద్‌లోనే పెరిగాను. నాకు ఆ కల్చర్ పై అవగాహన ఉంది. యాక్టర్‌గా, డ్యాన్సర్‌గా... ఇలా రోషన్ ఆల్ రౌండర్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ప్రదీప్ చక్కగా డైరెక్ట్ చేశాడు’’ అని చెప్పారు.


