
ఆర్. నారాయణ మూర్తి చాలారోజుల తర్వాత లీడ్ రోల్‌లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ‘పేపర్ లీక్’ అనేది ఉపశీర్షిక. నేటి సమాజంలో విద్యా వ్యవస్థ ఎలా ఉందో చెబుతూ ఆయన ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, అద్దంకి దయాకర్‌లతో పాటు దేశపతి శ్రీనివాస్, అందెశ్రీ, జయరాజ్, నందినీ సిద్ధారెడ్డి, ప్రోఫెసర్ ఖాసీం, పలువురు విద్యార్థి సంఘాల నాయకులుపాల్గొన్నారు. యూనివర్సిటీ సినిమా కేవలం విద్యార్థులే కాదు.. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా చూడదగిన మూవీ అని అన్నారు.
ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ.. నేటి సమాజంలో కాపీయంగ్ అనేది చాలా ప్రమాదకరమైనదని ఆయన అన్నారు. మన విద్యారంగంలో కొన్నేళ్లుగా జరుగుతున్న పేపర్ లీక్స్, గ్రూపు 1, 2 లాంటి ఉద్యోగ ప్రశ్నా పత్రాల లీక్స్ చూస్తుంటే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? వాళ్లకుపాఠాలు బోధించిన గురువులు ఏం కావాలి? అని మా సినిమా ద్వారా ప్రశ్నిస్తున్నామన్నారు. ‘యూనివర్సిటీ’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అవసరం లేదని పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి అన్నారు. 'నా మిత్రులు అద్దంకి దయాకర్, అందెశ్రీ తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఈ మూవీకి పన్ను మినహాయింపు ఇప్పిస్తామన్నారు. నాపై ప్రేమతో ఈ మాట చెప్పినందుకు వాళ్లకు కృతజ్ఞతలు. కానీ, నా సినిమాకు ఎలాంటి పన్ను మినహాయింపు వద్దు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం వద్దు. సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లండి చాలు’.' అని నారాయణ మూర్తి కోరారు.