టిల్లు- 3 గురించి ఆసక్తికర విషయాన్ని తెలిపిన నాగ వంశీ | Producer Naga Vamsi Comments On Tillu Square Sequel, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

టిల్లు- 3 గురించి ఆసక్తికర విషయాన్ని తెలిపిన నిర్మాత నాగ వంశీ

Published Sat, Mar 30 2024 7:44 AM

Producer Naga Vamsi Comments On Tillu Square Sequel - Sakshi

'డీజే టిల్లు'గా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్‌’తో ప్రేక్షకుల ముందుకు మళ్లీ వచ్చేశాడు. ఇప్పుడు కూడా అంతే రేంజ్‌లో నవ్వించడమే కాకుండా ప్రేక్షకులను కూడా మెప్పించాడు.  మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు.

‘టిల్లు స్క్వేర్‌’ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోనే కాదు.. ఈ చిత్రానికి  స్క్రిప్ట్‌ కూడా రాశాడు. హాస్యం ప్రధానంగా చాలా అద్భుతంగా కథను రాశాడు. అందుకే థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు మంచి అనుభూతి కలిగిందని బయటకు వస్తున్నారు. మార్చి 29న విడుదలైన  ‘టిల్లు స్క్వేర్‌’కు పాజిటివ్‌ టాక్‌ రావడంతో తాజాగా సిద్ధు జొన్నలగడ్డ ఇలా రియాక్ట్‌ అయ్యాడు.

'డీజే టిల్లు తీస్తున్నప్పుడే నన్ను నమ్మి మంచి ప్రమాణాలతో సినిమాని తీశారు నిర్మాతలు. అనుకున్నట్లు అది హిట్‌ కావడంతో సీక్వెల్‌ 'టిల్లు స్క్వేర్‌' విషయంలోనూ అదే జరిగింది. ఇలాంటి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకి కృతజ్ఞతలు. నేను నటుడి కంటే ముందు ఈ సినిమాకి  రచయితను. ఎంతో నిజాయతీగా కథ ఉండాలని రాశాను. ఎక్కువ, తక్కువలు అనే అభిప్రాయాలు లేకుండా ప్రతి పాత్రని డిజైన్‌ చేశాను. వాస్తవంగా అనుపమను వంద శాతం ఊహించి కథ రాస్తే.. తన నటనతో వెయ్యి శాతం 'టిల్లు స్క్వేర్‌'లో ప్రభావం చూపించింది. ఈ సినిమాలో కథ ప్రభావం ఎంతమేరకు ఉండాలో అంత వరకు మాత్రమే ఉంది.' అని ఆయన అన్నారు.

'టిల్లు స్క్వేర్‌' చిత్రానికి తొలి షో నుంచే మంచి టాక్‌ వచ్చిందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. రానున్న రోజుల్లో సెలవులు కూడా సినిమాకు కలిసొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. 'టిల్లు స్క్వేర్‌' రూ.వంద కోట్ల కలెక్షన్స్‌ సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పాడు. త్వరలో మూడో భాగాన్ని కూడా  ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement