ఏపీ ప్రభుత్వ నిర్ణయం శుభ పరిణామం : దిల్‌ రాజు

Producer Dil Raju Comments On Ap Ticket Issue - Sakshi

Producer Dil Raju Comments On Ap Ticket Issue: ‘‘ప్రేక్షకులను, సినిమా ఇండస్ట్రీని బ్యాలెన్స్‌ చేయాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఉంది. ఇలాంటి అంశాలపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ఓ కమిటీ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ–‘‘మా ఇబ్బందులు ఏంటి? అనేది ప్రభుత్వానికి ఇప్పటికీ కచ్చితంగా తెలియడం లేదు. టిక్కెట్ల ధర పెంపు, 5వ ఆటకు అనుమతి వంటి అంశాలపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఇండస్ట్రీ నుంచి ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్‌ ఉంటారు.

తెలుగు ఫిల్మ్‌ చాంబర్‌ నుంచి ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి కొన్ని పేర్లు కూడా పంపించారు. త్వరలోనే కమిటీని నియమిస్తారు. కమిటీ వల్ల ఇరువైపులా చర్చించేందుకు ఎక్కువ సమయం దొరుకుతుంది. ఈ కమిటీలోని వాళ్లు ఇండస్ట్రీ సాధక బాధకాలు ప్రభుత్వానికి వినిపించి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. అప్పటి వరకు ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచి ఎవరూ సోషల్‌ మీడియా పోస్టులు చేయకపోవడం, మాట్లాడకపోవడం మంచిది. ప్రభుత్వం నుంచే స్పందన వచ్చి సమస్యల పరిష్కారానికి ఓ కమిటీ వేశారు కాబట్టి త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నాం. మాకు అపాయింట్‌మెంట్‌ ఇస్తే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని, మంత్రి పేర్ని నానిగారిని కలవాలనుకుంటున్నాం.

ఇటు ఇండస్ట్రీకి అటు సొసైటీకి, ప్రభుత్వాలకు మధ్య మీడియాది చాలా కీలక పాత్ర. మాలో భాగమైన మీడియా కూడా ఇండస్ట్రీ వార్తలను సున్నితమైనవిగా చూడాలి కానీ సెన్సేషన్‌ చేయొద్దని కోరుకుంటున్నాం. ఇప్పటి పరిస్థితులను పాజిటివ్‌గానే తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి కూడా త్వరలోనే టిక్కెట్ల విషయంలో కొత్త జీవో వస్తుందని ఆశిస్తున్నాం. నిర్మాతల, ఎగ్జిబిటర్ల సమస్యలు వేర్వేరు. అన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళితే పరిష్కారం అవుతాయనే నమ్మకం ఉంది.

కమిటీ ఏర్పాటైన తర్వాత కూడా ప్రస్తుత అంశాలు పరిష్కారం కాకుంటే అన్ని క్రాఫ్ట్స్‌ వారు కూర్చుని ఎలా చేస్తే బాగుంటుందని అప్పుడు ఆలోచించుకుని మాట్లాడదాం.. దయచేసి అప్పటి వరకూ ఎవరూ స్పందించ వద్దు. కష్టమో, నష్టమో సినిమాల విడుదలను ఆపుకోలేం.. పెద్ద సినిమాలను అస్సలు ఆపుకోలేం. రిలీజ్‌కి రెడీగా ఉన్న వాటిని విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. తెలంగాణలో కొత్త టిక్కెట్‌ ధరలను నిర్ణయించి జీవో ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌గారికి, మంత్రి తలసానిగారికి నిర్మాతల తరఫున థ్యాంక్స్‌’’ అన్నారు. ఈ సమావేశంలో నిర్మాతలు ‘స్రవంతి’ రవికిశోర్, వంశీ పాల్గొన్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top