
కేంద్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం జాతీయ చలన చిత్ర అవార్డులు ప్రకటించింది. జవాన్, 12th ఫెయిల్, సామ్ బహదూర్, పార్కింగ్, బేబి, బలగం, హనుమాన్.. ఇలా పలు సినిమాలకు వివిధ కేటగిరీల్లో పురస్కారాలు వరించాయి. అయితే రూ.150 కోట్లకిపైగా కొల్లగొట్టిన 'ఆడుజీవితం సినిమా' (Aadujeevitham: The Goat Life Movie)కు మాత్రం ఎటువంటి అవార్డు రాలేదు. ఆడుజీవితం నవల ఆధారంగా దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమా తెరకెక్కించాడు. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుతంగా నటించాడు.
ప్రేక్షకుల కోసమే మా సినిమా
హృదయాలను కదిలించిన ఈ సినిమాకు జాతీయ అవార్డు రాకపోవడంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తాజాగా ఈ వ్యవహారంపై హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తొలిసారిగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ.. సినిమా అనేది ప్రేక్షకుల కోసం తీస్తాం. అంతేకానీ జ్యూరీ కోసమో, మార్కులిచ్చే పదిమంది కోసమో కాదు. కేవలం అంతర్జాతీయ చలనచిత్ర వేడుకల్లో ప్రదర్శితమయ్యేందుకే సినిమాలు తీయము. అవార్డులకు.. వాటి విలువ వాటికి ఉండొచ్చు. కానీ అంతిమంగా ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం ముఖ్యం.
అదే పెద్ద అవార్డు
టికెట్ కొని థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు సినిమాను ఆస్వాదించగలగాలి. వాళ్లంతా ఆడుజీవితాన్ని ఆస్వాదించారు, ఆదరించారు. అదే మాకు గొప్ప అవార్డు. అందుకు నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా ఆడు జీవితం 6 'కేరళ స్టేట్ ఫిలిం అవార్డులు' సాధించింది. జాతీయ అవార్డు కోసం 14 కేటగిరీల్లో పోటీపడినప్పటికీ ఒక్క పురస్కారం కూడా గెలుచుకోలేకపోయింది.
చదవండి: నోరు తెరిస్తే అబద్ధాలు, నీవల్లే గొడవలు.. నామినేషన్స్‌లో హీరోయిన్