
ప్రవీణ పరుచూరి (Praveena Paruchuri).. అమెరికాలో సెటిలైన ఈ తెలుగమ్మాయి అక్కడ కార్డియాలజిస్ట్‌గా పని చేసింది. కానీ సినిమాలపై పిచ్చితో తన వృత్తిని వదిలేసి స్వదేశానికి తిరిగొచ్చింది. టాలీవుడ్‌లో అడుగుపెట్టి కేరాఫ్ కంచరపాలెం సినిమాతో నిర్మాతగా హిట్టు కొట్టింది. సినిమాను నిర్మించడంతోపాటు అందులో సలీమా అనే వేశ్య పాత్రలోనూ నటించింది. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య అనే సినిమాకు సైతం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించింది.
డైరెక్షన్ కష్టం
తాజాగా ప్రవీణ దర్శకురాలిగా మారింది. కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమా చేస్తోంది. ఈ చిత్రం జూలై 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ప్రవీణ.. నటీనటులతో మంచి పర్ఫామెన్స్ రాబట్టేందుకు వారిపై చేయి చేసుకున్నానని వెల్లడించింది. ప్రవీణ పరుచూరి మాట్లాడుతూ.. డైరెక్షన్ చాలా కష్టమైనది. డైరెక్షన్ చేసేటప్పుడు చాలా డౌట్స్ వస్తాయి. ఈ పర్ఫామెన్స్ ఓకేనా? ఈ బీజీఎం వర్కవుట్ అవుతుందా? ఈ ఎడిట్ ఓకేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు వెంటాడాయి. షూటింగ్ మాత్రం 33 రోజుల్లో త్వరగా అయిపోయింది.
హీరోను కొట్టా, తిట్టా..
హీరో మనోజ్ చంద్ర సిటీ అబ్బాయి. ఇతడిని పల్లెటూరి కుర్రాడిలా తయారుచేయడమే అసలైన కష్టం. అలాగే కొత్త హీరోయిన్‌ను పరిచయం చేస్తున్నాం. వీరిద్దరి మధ్య సీన్లు పండకపోతే సినిమా పండదు. కాబట్టి ఈ ఇద్దరిపైనే ఎక్కువ దృష్టి పెట్టాను. నిజం చెప్పాలంటే వీళ్లను తిట్టాను, కొట్టాను, రాళ్లు విసిరాను. ఎందుకంటే నా దృష్టిలో నటించడం అంటే జీవించడం. అందుకే నేను చేసిన పనికి వీళ్లకు సారీ చెప్పను. నేను డాక్టర్‌ను కాబట్టి ఏదైనా అయితే బాగానే చూసుకున్నాను అని ప్రవీణ చెప్పుకొచ్చింది.