మొన్న పూజ హెగ్డే.. నేడు సాయి పల్లవి.. ఎందుకిలా? | Pooja Hegde To Sai Pallavi, South Actress Struggles In Bollywood | Sakshi
Sakshi News home page

మొన్న పూజ హెగ్డే.. నేడు సాయి పల్లవి.. 'సౌత్'భామల తడబాటు

May 6 2026 2:35 PM | Updated on May 6 2026 2:42 PM

Pooja Hegde To Sai Pallavi, South Actress Struggles In Bollywood

బాలీవుడ్‌లో రాణించలేకపోతున్న సౌత్‌ హీరోయిన్లు

దక్షిణాది వెండితెరపై వెలిగిపోతున్న తారలు బాలీవుడ్‌కు వెళ్లేసరికి ఎందుకో ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోతున్నారు. తాజాగా సాయి పల్లవి నటించిన హిందీ చిత్రం ‘ఏక్ దిన్’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో, ఉత్తరాది ప్రేక్షకులను మెప్పించడంలో సౌత్ భామలు ఎదుర్కొంటున్న సవాళ్లపై మరోసారి చర్చ మొదలైంది.

టాలీవుడ్, కోలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లు.. బాలీవుడ్‌లో మాత్రం అడుగు పెట్టగానే తడబడుతున్నారు. కోట్లాది మంది అభిమానం, అద్భుతమైన నటన ఉన్నప్పటికీ, అక్కడ సక్సెస్ రేటు మాత్రం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు.

తనదైన నటనతో నేచురల్‌ స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్న సాయి పల్లవి.. హిందీ డెబ్యూ మూవీ ‘ఏక్ దిన్’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం కనీస వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో కలిసి నటించినా, ఈ సినిమా సాయి పల్లవికి బాలీవుడ్‌లో శుభారంభాన్ని ఇవ్వలేకపోయింది.

కేవలం సాయి పల్లవి మాత్రమే కాదు, గతంలో అనేకమంది సౌత్ స్టార్ హీరోయిన్లు ఇదే బాటలో ఇబ్బందులు పడ్డారు. సౌత్ టాప్ హీరోయిన్లలో ఒకరైన కీర్తి సురేశ్‌ కూడా 'బేబీ జాన్' అనే హిందీ సినిమాలో కనిపించింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. పూజా హెగ్డే , తమన్నాలు గ్లామర్ పరంగా అక్కడ మార్కులు కొట్టేసినా, భారీ విజయాలు మాత్రం వీరికి దక్కలేదు. 

ఇక దక్షిణాదిలో చాలా ఏళ్లుగా స్టార్‌ హీరోయిన్లుగా కొనసాగుతున్న త్రిష, నయనతారలు కూడా బాలీవుడ్‌లో రాణించలేకపోయారు. 'ఖట్టా మీఠా' అనే మూవీతో త్రిష బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. కానీ ఆ తర్వాత త్రిషలో అక్కడ పెద్ద అవకాశాలేవి రాలేదు.  నయనతార తొలి హిందీ సినిమా ‘జవాన్‌’ బాక్సాఫీస్‌ వద్ద రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కానీ ఆశించిన స్థాయిలో స్టార్‌డమ్‌ని తీసుకురాలేకపోయింది. 

అయితే సౌత్‌ తారలు అందరూ విఫలమవుతున్నారని చెప్పలేం. తాప్సీ పన్ను సౌత్‌లో కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువ స్థిరపడింది. అలాగే రష్మిక మందన్నా కూడా ‘యానిమల్’ సినిమాతో అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసి, మరిన్ని అవకాశాలను చేజిక్కించుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement