ఇక మా ప్రయాణం మారుతుంది

Pedakapu Movie Review Producer Miryala Ravinder Reddy - Sakshi

‘‘తెలుగు పరిశ్రమలో చెప్పుకోదగ్గ సినిమాలు అరుదుగా ఉంటాయి. మా ‘పెదకాపు 1’ కూడా అరుదైన చిత్రంగా నిలుస్తుంది. ఈ సినిమా తర్వాత మా ద్వారక క్రియేషన్స్‌ ప్రయాణం మారుతుంది’’ అని నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి అన్నారు. విరాట్‌ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రం ‘పెదకాపు 1’. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మిర్యాల రవీందర్‌ రెడ్డి విలేకరులతో పంచుకున్న విశేషాలు. 

‘పెదకాపు 1’ చిత్రకథకి కొత్త హీరో అయితేనే సహజత్వం వస్తుంది. అందుకే విరాట్‌ కర్ణని తీసుకున్నాం. సినిమా మొత్తం చాలా సహజత్వంతో ఉంటుంది. ఎక్కడ కూడా సెట్స్‌ వేయలేదు. 1980 నాటి పరిస్థితులని ప్రతిబింబించేలా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో నిజమైన లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ఒక చరిత్రని కళ్ల ముందు ఎలా చూపించాలో అలానే సహజంగా చూపించారు శ్రీకాంత్‌ అడ్డాల. మా సినిమాని చూస్తున్నప్పుడు నిజ జీవితాన్నే తెరపై చూస్తున్న అనుభూతి కలుగుతుంది.

ఒక సామాన్యుడు తన పరిస్థితులను తట్టుకొని బలవంతుడిని జయించాలంటే ఒక యుద్ధమే చేయాలి. మనం అనుకున్నది సాధించాలంటే పోరాటం తప్పితే వేరే మార్గం లేదు.. అదే ఈ సినిమా కథ. కుటుంబం, సమూహం, ప్రాంతం.. ఇలా ఏదైనా నా అనుకొనే వారి కోసం కాపు కాసేవారికి పెదకాపు అనే పేరు ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే మేం ‘పెదకాపు’ టైటిల్‌ పెట్టాం.

విరాట్‌ని స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు ఒక పెద్ద హీరోని చూసిన అనుభూతి కలిగింది. విరాట్‌ని వైజాగ్‌ సత్యానంద్‌గారు హీరో ప్రభాస్‌తో పోల్చడం హ్యాపీగా ఉంది. శ్రీకాంత్‌ అడ్డాలగారు విలన్‌గా చక్కగా సరిపోయారు. మిక్కీ జె. మేయర్‌ అద్భుతమైన మ్యూజిక్, నేపథ్య సంగీతం ఇచ్చారు. ‘పెదకాపు 1’ రిలీజ్‌ తర్వాత ‘పెదకాపు 2’ ఉంటుంది. ఆ తర్వాత అడివి శేష్‌తో ఓ చిత్రం చేస్తాను. అలాగే ‘అఖండ 2’తో పాటు మరో రెండు మూడు కథలు చర్చల్లో ఉన్నాయి. – నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top