
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో వస్తోన్న లేడీ ఓరియంటెడ్ చిత్రం 'పరదా'. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ మూవీని విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మించారు. తాజాగా హైదరాబాద్లో ఈ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఈవెంట్కు హాజరైన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా రివ్యూలు నచ్చితేనే పరదా మూవీ చూడాలని అన్నారు. ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత ముఖ్య పాత్రలు పోషించారు.
ప్రవీణ్ మాట్లాడుతూ.. 'నా రెండు సినిమాలు శుభం, సినిమా బండి ఒక జోనర్ చిత్రాలు. కానీ ఈ సినిమా నాకు పర్సనల్గా బిగ్ స్కేల్ ఫిల్మ్. వీడు చిన్న సినిమాలు చేస్తు బతికేస్తాడులే అందరు అనుకుంటారు. కానీ ముగ్గురు స్టార్స్‌తో పక్కా కమర్షియల్ సినిమా తీశా. ఈ చిత్రానికి మంచి పేరు తప్పకుండా వస్తుంది. కానీ పేరు ముఖ్యం కాదు.. డబ్బులు రావాలి. ఇలా జరిగితే ఇలాంటి కంటెంట్ సినిమాలు తీసేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారు. అనుపమకు ఇదొక పెద్ద సోలో ఫిల్మ్. అనుష్కకు అరుంధతిలాగే అనుపమకు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఇది తనకు చాలా ఫేవరేట్ మూవీ. థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి. రివ్యూలు బాగుంటేనే మా చిత్రాన్ని చూడండి. ఇది నా ఛాలెంజ్' అంటూ మాట్లాడారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 22న థియేటర్లలో సందడి చేయనుంది.