‘పళ్లిచట్టంబి’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Pallichattambi Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Pallichattambi Telugu Review: ‘పళ్లిచట్టంబి’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Apr 17 2026 8:06 AM | Updated on Apr 17 2026 8:45 AM

Pallichattambi Movie Review And Rating In Telugu

టొవినో థామస్ సినిమాలు కేరళలో బాగానే సక్సెస్ అవుతుంటాయి. తెలుగులోనూ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ‘పళ్లిచట్టంబి’ కోసం తెలుగు ఆడియెన్స్ కోసం ఎంతో వెయిట్ చేశారు. మొత్తానికి ఈ చిత్రం నేడు(ఏప్రిల్‌ 17) థియేటర్లోకి వచ్చింది. మరి ఈ ‘పళ్లిచట్టంబి’ కథ ఏంటి? సినిమా ఎలా ఉంది? తెలుగు వారిని ఆకట్టుకుంటుందా? లేదా? అన్నది ఓ సారి చూద్దాం.

కథేంటంటే..
ఇది పూర్తిగా కేరళ ప్రాంతానికి చెందిన కథ. అందుకే ఇందులోని పాత్రల పేర్లు, ఊరి పేర్లు కూడా అక్కడి నేటివిటికీ తగ్గట్టే ఉంటాయి. 1930లో ఈ కథ ప్రారంభం అవుతుంది. కేరళ, కర్ణాటక ప్రాంతం. అక్కడి చుట్టు పక్కల అటవీ ప్రాంతానికి కింగ్ నంబియార్. నంబియార్ గడ్డ మీద ఆంగ్లేయులు కూడా అడుగు పెట్టలేరు. 1958లో కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఆ సమయంలో కణియార్ గ్రామంలో అల్లర్లు జరుగుతుంటాయి. అక్కడి కమ్యూనిస్టులకు, క్రిస్టియన్లకు గొడవలు జరుగుతుంటాయి. తమ చర్చిని, ప్రజల్ని కాపాడుకునేందుకు అక్కడి ఫాదర్, గ్రామస్తులు కలిసి  క్రిష్టోఫర్ (రక్షకుడు), ఓ చట్టంబి (రౌడీ)ని తెచ్చుకుంటుంది. 

తోమాపురంకి చెందిన హిందువు కృష్ణ పిళ్లై(టొవినో థామస్)ని పోతన్ క్రిష్టోఫర్‌గా మార్చి తీసుకు వస్తారు. మరి ఆ పోతన్ వచ్చాక కణియార్ గ్రామం ఎలా మారుతుంది? కమ్యూనిస్ట్‌లను అతను ఎలా నిలువరించారు? కమ్యూనిస్ట్ పార్టీ కోసం నాటకాలు వేసే రెబెక్కా (కయాదు లోహర్) పాత్ర ఏంటి? ఆమె లక్ష్యం కోసం క్రిష్టోఫర్ ఏం చేస్తాడు? అసలు ఈ అల్లర్ల వెనుకున్నది ఎవరు? క్రూరుడైన రైలు రామన్న (శత్రు) పాత్ర ఏంటి? కణియార్ ఊరికి పక్కనే ఉండే పిశాచి కొండ వెనుకున్న రహస్యం ఏంటి? ఇక ఊరిని, చర్చిని క్రిష్టోఫర్ ఎలా కాపాడతాడు అన్నదే కథ.

ఎలా ఉందంటే..
‘పళ్లిచట్టంబి’ అంటే చర్చ్ రౌడీ. చర్చ్‌ని కాపాడుకునేందుకు ఒకప్పుడు కేరళలో ఈ చట్టంబిలను పెట్టుకున్నారు. ఈ కథను వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించామని టొవినో థామస్ ఇది వరకే చెప్పాడు. అందుకే అక్కడి ప్రాంతంలో జరిగిన కథ కాబట్టి.. అక్కడి పేర్లే కనిపిస్తుంటాయి. ప్రాంతం ఏదైనా ఎమోషన్ మాత్రం ఒకటే. ఎమోషన్స్ పండితే.. ఏ భాషా చిత్రం.. ఎక్కడి చిత్రం అన్నది ఆడియెన్స్ పట్టించుకోరు. ఈ పళ్లిచట్టంబి చిత్రంలోనూ చాలా వరకు ఎమోషన్స్ పర్వాలేదనిపిస్తాయి. అయితే ఫస్టాఫ్‌ కంటే సెకండాఫ్ మరింత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది.

ఊర్లో గొడవలు.. హీరో ఆ ఊరికి రావడం..వారికి రక్షణగా ఉంటూ.. శిక్షణ అందించడం..ఇలాంటి కథలు తెలుగులో చాలానే వచ్చాయి. పళ్లి చట్టంబి కథ కూడా ఇలానే సాగుతుంది. 

ఫస్టాఫ్‌ అంతా కూడా ఎలాంటి కాన్ ఫ్లిక్ట్ లేకుండా సాగినట్టు కనిపిస్తుంది. ఇంటర్వెల్‌కి కథ ఆసక్తికరంగా మారుతుంది. ఇక ద్వితీయార్దంలో అసలు కథను రివీల్ చేస్తారు. అక్కడి సినిమా మరింత ఆసక్తికరంగా మారుతుంది. నంబియార్ పాత్రను రివీల్ చేసిన తీరు, చూపించిన విధానం బాగుంటుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది.

సాంకేతికంగా ఈ చిత్రం టాప్ నాచ్‌లో ఉంటుంది. ఆర్ఆర్ అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. ప్రతీ ఫైట్, ఎమోషనల్ సీన్స్ జేక్స్ అదరగొట్టేశాడు. ఇక విజువల్స్ అయితే ఎంతో నేచురల్‌గా కనిపిస్తాయి. ఆర్ట్ వర్క్, క్యాస్టూమ్స్ ఇలా బాగుంటాయి. నిర్మాణ పరంగా భారీగానే ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుంది. నిర్మాతలు పెట్టిన ప్రతీ పైసా తెరపై కనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే?
టొవినో థామస్ యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతని యాక్టింగ్ కారణంగానే తెలుగులోనూ టొవినోకి మంచి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. లుక్స్ పరంగానూ, యాక్షన్ పరంగానూ టొవినో అదరగొట్టేశాడు. కామెడీ, ఫైట్స్, ఎమోషనల్ సీన్స్ అన్నింట్లోనూ మెప్పించాడు. ఇక కయాదు అయితే చాలా కొత్తగా, మరింత అందంగా కనిపిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ తన పాత్రతో, యాక్టింగ్‌తో భయపెట్టేస్తాడు. శత్రుకి మంచి పాత్ర లభించింది. మిగిలిన ఆర్టిస్టులు మలయాళీలే కావడంతో మన తెలుగు ఆడియెన్స్ ఎక్కువ కనెక్ట్ కాలేకపోవచ్చు.

కేరళ ప్రాంతానికి సంబంధించిన కథ కావడం, తెలుగు నేటివిటికీ దూరంగా ఉండటం కాస్త మైనస్ అని చెప్పుకోవచ్చు. అక్కడి ప్రజలకు నచ్చినంతగా ఈ చిత్రం ఇక్కడి వారికి నచ్చకపోవచ్చు. అలా అని ‘పళ్లిచట్టంబి’ ప్రయత్నం అయితే వృథాగా పోదు. టెక్నికల్లీ బ్రిల్లియంట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు.

Rating:
Advertisement
 
Advertisement
Advertisement