'ఓదెల 2' మూవీ రివ్యూ.. శివశక్తిగా తమన్నా మెప్పించిందా..? | Odela 2 Movie Review And Rating Telugu | Sakshi
Sakshi News home page

'ఓదెల 2' మూవీ రివ్యూ.. మితిమీరిన వయలెన్స్

Apr 17 2025 1:47 PM | Updated on Apr 17 2025 5:50 PM

Odela 2 Movie Review And Rating Telugu

టైటిల్‌ : ఓదెల 2
నటీనటులు: తమన్నా, హెబ్బా పటేల్‌, వశిష్ఠ ఎన్‌.సింహ,యువ, మురళీ శర్మ, యువ, నాగ మహేశ్‌, వంశీ  తదితరులు
నిర్మాణ సంస్థలు:  సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌, మధు క్రియేషన్స్‌
నిర్మాతలు: డీ. మధు
ఎడిటింగ్: అవినాష్‌
దర్శకత్వం:  అశోక్‌ తేజ 
కథ, దర్శకత్వ పర్యవేక్షణ: సంపత్‌ నంది
సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌
సినిమాటోగ్రఫీ: సౌందర్‌ రాజన్‌.ఎస్‌
విడుదల: ఏప్రిల్‌ 17, 2025

సుమారు మూడేళ్ల క్రితం వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ చిత్రానికి కొనసాగింపుగా ‘ఓదెల 2’ చిత్రాన్ని దర్శకుడు అశోక్‌తేజ తెరకెక్కించారు.  సంపత్‌ నంది టీమ్‌ వర్క్స్‌తో కలిసి మధు క్రియేషన్స్‌ పతాకంపై డి.మధు నిర్మించారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించగా హెబ్బా పటేల్‌, వశిష్ఠ ఎన్‌.సింహ కీలక పాత్రలలో మెప్పించారు. 2022లో ఓటీటీ వేదికలో విడుదలైన ‘ఓదెల రైల్వేస్టేషన్‌’  ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందింది. దర్శకుడు సంపత్‌ నంది ఇచ్చిన కథతో, అశోక్‌తేజ ఆ చిత్రాన్ని తెరకెక్కించారు.  ఇదే కలయికలో మరింత ఘనంగా, థ్రిల్లింగ్‌గా 'ఓదెల2' చిత్రాన్ని రూపొందించామని చిత్ర ప్రమోషన్స్‌ కార్యక్రమాలలో చెప్పారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేస్తూ.. తమన్నా గుర్తుండిపోయే పాత్రలో కనిపించారని ట్రైలర్‌ చూస్తే అర్థం అవుతుంది. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుంచి ఎలా రక్షిస్తాడనేది 'ఓదెల2' అసలు కథ. నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

కథేంటి..
తిరుపతి (వశిష్ఠ) మరణంతో ‘ఓదెల రైల్వేస్టేషన్‌’ సినిమా ముగుస్తుంది. అయితే, ఓదెల 2 అక్కడి నుంచే మొదలౌతుంది. తిరుపతి మరణించడంతో గ్రామస్థులందరూ సంతోషంగా ఉంటారు.  తమ గ్రామంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిల శోభనం నాడే చంపిన తిరుపతిని రాధ (హెబా పటేల్) చంపేసి మంచి పనిచేసిందని అనుకుంటారు. అయితే, తిరుపతి ఆత్మకు కూడా శాంతి ఉండకూడదని గ్రామ పెద్దలు నిర్ణయించుకుందటారు. అలా జరగాలంటే అతని అంత్యక్రియలు ఎలా చేయాలో గ్రామంలోని పూజారిని అడిగి తెలుసుకుంటారు. శాస్త్రాల ప్రకారం 'సమాధి శిక్ష' పద్ధతి ద్వారా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. దీంతో తిరుపతి ఆత్మ గోషిస్తూ ఉంటుంది. అదే అతనికి శిక్ష అంటూ గ్రామ పెద్దలు నిర్ణయిస్తారు. అలా కొద్దిరోజులు గడిచిన తర్వాత ఆ గ్రామంలో మళ్లీ పెళ్లి జరుగుతుంది. గతం మాదిరే శోభనం నాడే అత్యంత క్రూరంగా యువతులు హత్య చేయబడుతారు. ఇలాంటి ఘటనలు రెండు జరగడంతో గ్రామంలో మళ్లీ భయం మొదలౌతుంది. పోలీసులు రంగప్రవేశం చేసినప్పటికీ వారి చావులకు అసలు కారణాలు కనుగొనలేరు. 

'ఓదెల 2' మూవీ రివ్యూ

అయితే, అదే గ్రామానికి చెందిన దర్గాలో ఉన్న మురళీ శర్మ (ఫకీర్‌) అసలు కారణం కనుక్కొంటాడు. తిరుపతి దెయ్యంగా తిరిగొచ్చాడని చెప్తాడు. దీంతో తమ గ్రామాన్ని ఎవరు కాపాడుతారని ఆందోళనలో గ్రామస్తులు ఉంటారు. అయితే, ఒకరోజు జైల్లో ఉన్న రాధ (హెబా పటేల్) వద్దకు వెళ్లి జరిగిన హత్యల గురించి చెప్తారు. ఎలాగైనా తిరుపతి నుంచి ఓదెల గ్రామాన్ని కాపాడాలని వేడుకుంటారు. దీంతో శివశక్తి (తమన్నా) మాత్రమే కాపాడుతుందని వారికి చెబుతుంది. శివశక్తి గతం గురించి చెబుతూ ఆమె ఎక్కడ ఉంటుందో వివరాలు తెలుపుతుంది. అలా ఒదెల గ్రామాన్ని కాపాడేందుకు శివశక్తి (తమన్నా)ను అక్కడ తీసుకొస్తారు. అలా దైవశక్తికి, ప్రేతాత్మ శక్తిల మధ్య పెద్ద పోరాటమే జరుగుతుంది. మరణించిన తిరుపతి 'సమాధి శిక్ష' నుంచి ఎలా తిరిగొస్తాడు..? శివశక్తి (తమన్నా),  రాధ (హెబా పటేల్) మధ్య ఉన్న బంధం ఏంటి..? శివశక్తిలా తమన్నా మారడం వెనుకన్న అసలు స్టోరీ ఎంటి..? ఫైనల్‌గా తిరుపతి అంతం అవుతాడా..? మళ్లీ తిరిగొస్తాడా..? అనేది తెలియాలంటే ఓదెల2 చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
దుష్టశక్తి, దైవశక్తిల పోరాటం గురించి చాలా సినిమాలు వచ్చాయి. ఓదెల2 కూడా ఇదే కోవకు చెందిన కథే.. సినిమా ఎక్కడా కూడా కొత్తగా అనిపించదు. ప్రతి సీన్‌ దాదాపు అంచనా వేయవచ్చు. మూడేళ్ల క్రితం వచ్చిన  ‘ఓదెల రైల్వేస్టేషన్‌’లో చూపించిన ఉదంతాలే పార్ట్‌-2లో ఎక్కువ భాగం కనిపిస్తాయి. గ్రామంలోని కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు తమ శోభనం నాడే అత్యంత దారుణంగా చనిపోతారు. అందుకు కారణం ఒక ప్రేతాత్మ అనేది మాత్రమే ఇక్కడ కాస్త భిన్నంగా ఉంటుంది. ఒదెల2 కథ ప్రారంభం ఘనంగా ఉన్నప్పటికీ మొదటి 15 నిమిషాల్లోనే తేలిపోతుంది. సుమారు ఇంటర్వెల్‌ వరకు కొత్తగా పెళ్లైన ఇద్దరి అమ్మాయిల చావుల చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. పార్ట్‌1 చూసిన వారికి ఇవేమీ అంత కొత్తగా అనిపించవు.. అయితే, వారి హత్యలు చాలా క్రూరంగా ఉంటాయి. మరీ వయలెన్స్‌ ఎక్కువ అయిందేమో అనిపించేలా ఆ సీన్స్‌ ఉంటాయి. 

శివశక్తిగా (తమన్నా) ఎంట్రీ   చాలా ఆలస్యంగా ఉంటుంది. అది కాస్త ప్రేక్షకులకు రుచించకపోవచ్చు. ఎప్పుడైతే తమన్నా కథలోకి ఎంట్రీ ఇస్తుందో కథ అనేక మలుపులు తిరుగుతుందని అనుకుంటారు. కానీ, సాధారణ రొటీన్‌ పద్ధతిలోనే స్టోరీ కొనసాగుతుంది. ఆమె నాగసాధువుగా ఎందుకు మారిందో చెప్పిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది. అయితే, ఓదెల2లో ప్రేతాత్మగా ఉన్న తిరుపతి (వశిష్ఠ) పాత్రను చాలా బలంగా రాసుకున్న రచయిత..   శివశక్తిగా (తమన్నా) పాత్రను అంత పవర్‌ఫుల్‌గా ప్రజెంట్‌ చేయలేకపోయాడు.  దుష్టశక్తి, దైవశక్తిల పోరాటంలో పైచెయి దుష్టశక్తిదే ప్రతిసారి కనిపించడంతో ప్రేక్షకులలో విసుగు తెప్పిస్తుంది. హార్రర్‌ సినిమా అంటే భయపడుతారని అందరిలో అంచనాలు ఉంటాయి. కానీ, అలాంటిదేవీ ఇందులో ఉండదు.. పైగా హత్యలకు సంబంధించిన వయలెన్స్‌ సీన్లే ఎక్కువగా కలవరపెడుతాయి. 

శివశక్తిగా తమన్నాకు మొదట ఇచ్చిన అంత ఎలివేషన్‌ దుష్టశక్తితో పోరాడే విషయంలో ఎంతమాత్రం దాని ప్రభావం చూపించలేదు. కథలో చాలాసార్లు రిపీటెడ్‌ సీన్లే ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా మొత్తానికి చివరి 15 నిమిషాలు చాలా హైప్‌ ఉంటుంది. అక్కడ మాత్రమే శివశక్తిగా తమన్నా విశ్వరూపం చూడొచ్చు.. ఈ సినిమాకు బలం తమన్నా నటన మాత్రమే.. శివశక్తిగా విశ్వరూపం చూపించాల్సిన పాత్రకు ఎలాంటి శక్తులు లేకుండా ప్రేక్షకులకు చూపించడాన్ని  పెద్దగా కనెక్ట్‌ కాలేరు. సినిమా చివరి వరకు కూడా దుష్టశక్తి మీద దైవశక్తి పైచెయి అనేది కనిపించకపోవడం అంతగా రుచించదు.  ప్రేతాత్మకు, పంచాక్షరీ మంత్రానికి మధ్య జరిగిన యుధ్దం అని చెప్పినప్పటికీ కనీసం దైవశక్తికి ఉన్న బలం ఏంటి అనేది దర్శకుడు చివరి వరకు చూపించకపోవడం పెద్ద పొరపాటుగా చెప్పవచ్చు. అయితే, పార్ట్‌-3 కూడా ప్రకటించారు. అందులో శివశక్తిగా (తమన్నా) పాత్ర బలంగా ఉండబోతుందేమో తెలియాల్సి ఉంది.

ఎవరెలా చేశారంటే..
ఓదెల-2 కేవలం తమన్నా కోసం మాత్రమే వెళ్లోచ్చు. తన ఎంట్రీ ఆలస్యంగా ఉన్నప్పటికీ కొత్తగా ఉంటుంది. ఇంటర్వెల్‌ సీన్‌లో తమన్నాను చూస్తే గూస్‌ బంప్స్‌ రావడం గ్యారెంటీ. ఇప్పటి వరకు గ్లామర్‌ పాత్రలు మాత్రమే చేసిన తమన్నా మొదటిసారి శివశక్తిగా అదరగొట్టేసింది. ఆ తర్వాత ఈ మూవీకి అజనీష్‌ లోక్‌నాథ్‌ ఇచ్చిన బీజీఎమ్‌తో పాటు సంగీతం సూపర్బ్‌ అనిచెప్పవచ్చు. తమన్నా ఎంట్రీ సీన్‌తో పాటు క్లైమాక్స్‌లో అదరగొట్టేశాడని చెప్పవచ్చు. ఆపై సౌందర్‌ రాజన్‌.ఎస్‌ అందించిన సినిమాటోగ్రఫీ కథకు బాగా సెట్‌ అయింది. ముఖ్యంగా రాత్రి సమయంలో తీసిన సీన్స్‌ బాగున్నాయి. అక్కడక్కడా ప్రేక్షకులను భయపెట్టే వర్క్‌ కెమెరాలతో తను మాత్రమే చేశాడని చెప్పవచ్చు. 

ఓదెల2లో ఎక్కువగా రిపీటెడ్‌ సీన్స్‌ వస్తున్నాయనే ఫీలింగ్‌ చాలామందిలో కలుగుతుంది. ఇంకాస్త కత్తెరకు పనిచెప్పింటే బాగుండు. బడ్జెట్‌ మేరకు వీఎఫ్‌ఎక్స్‌, నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి. తిరుపతి (వశిష్ఠ) ప్రేతాత్మగా చాలా బాగా చేశాడు. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. కానీ, శివశక్తిగా (తమన్నా) పాత్రను అత్యంత బలహీనంగా రాసుకోవడమే ఈ సినిమాకు పెద్ద మైనస్‌.. తమన్నా పాత్ర కాస్త పవర్‌ఫుల్‌గా ఉండుంటే ఓదెల-2 బ్లాక్‌బస్టర్‌ గ్యారెంటీ అని చెప్పవచ్చు.

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement