పెళ్లి త్వరలోనే, ఈ సారి ఎలాంటి దాపరికం లేదు: నయన్‌

Nayantara Open Up On Marriage With Vignesh Shivan - Sakshi

ఐదేళ్లుగా ప్రేమలో మునిగి తేలుతున్న లవ్‌బర్డ్స్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌లు సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓ టీవీ షోకు హజరైన నయన్‌ ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు వెల్లడించింది. లాక్‌డౌన్‌లో కొద్దిమంది కుటుంబ సభ్యులు మధ్య ఈ వేడుక జరిగినట్లు తెలిపింది. అయితే త్వరలోనే పెళ్లి కూడా జరగనున్నట్లు స్పష్టం చేసింది. అయితే నిశ్చితార్థం కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరిగింది.. కానీ పెళ్లి మాత్రం గ్రాండ్‌గా అందరి సమక్షంలో చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. పెళ్లి విషయంలో మాత్రం ఎలాంటి దాపరికం లేకుండా అందరిని ఆహ్వానిస్తానని పేర్కొంది.

విఘ్నేశ్‌శివన్‌ తన జీవితంలోకి ప్రవేశించిన తర్వాత కెరీర్‌ మరింత ఊపందుకుందని, అతని ప్రోత్సాహంతో వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నత లక్ష్యాల్ని ఎంచుకున్నానని పేర్కొంది. కాగా 2015లో ‘నానుమ్ రౌడీదాన్’ సినిమా స‌మ‌యంలో న‌య‌న్‌, విఘ్నేశ్‌లు ప్రేమ‌లో ప‌డ్డారు. అప్పటి నుంచి ఇప్పటివ‌ర‌కు ఎన్నో విహార‌యాత్రలు ప్లాన్ చేస్తూ ప‌నిలో ప‌నిగా ప‌లు దేశాలు కూడా చుట్టొచ్చేశారు. పండగలు, పుట్టిన రోజులు అన్నీ కలిసి సెలబ్రేట్‌ చేసుకున్న వీళ్లిద్దరూ మొత్తానికి ఒకింటివారవుతుండటంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. ఇదిలా వుంటే విఘ్నేశ్‌ ప్రస్తుతం కాతువాక్కుల రెండు కాదల్‌ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇందులో విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత అక్కినేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top