ఏపీలో టికెట్ల ధర విషయంలో నాకు ఇబ్బంది లేదు

Nagarjuna Shocking Comments On AP Movie Ticket Prices - Sakshi

– నాగార్జున

‘‘ఏపీలోని సినిమా టికెట్‌ ధరల విషయంలో నాకు ఏ ఇబ్బంది లేదు.. నా సినిమాకు ఇబ్బంది లేదు. టికెట్ల ధరలు తక్కువ ఉంటే తక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ ఉంటే కాస్త ఎక్కువగా వస్తాయి. టికెట్ల ధరలు పెరుగుతాయని సినిమాని జేబులో పెట్టుకుని కూర్చోలేం. నెంబర్స్‌ ప్రతి ఏడాది మారుతూనే ఉంటాయి. ఈ నెంబర్‌ గేమ్స్‌ నుంచి నేనెప్పుడో బయటకు వచ్చాను’’ అని నాగార్జున అన్నారు.

నాగార్జున, నాగచైతన్య హీరోలుగా కల్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బంగార్రాజు: సోగ్గాడు మళ్లీ వచ్చాడు’. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున నిర్మించారు. బుధవారం జరిగిన ఈ సినిమా ప్రెస్‌మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ – ‘‘ఇంత పెద్ద సినిమాను టైమ్‌కు రిలీజ్‌ చేయగలమా అనుకున్నాం. కానీ మా సినిమా రిలీజ్‌ డేట్‌ను నిన్ననే (మంగళ వారం) ఫిక్సయ్యాం. జనవరి 14న ‘బంగార్రాజు’ని విడుదల చేస్తున్నాం. సినిమా ఇంత తొందరగా ఎలా పూర్తయిందో నాక్కూడా తెలియడం లేదు.

ఇందులో ఏదో సూపర్‌ పవర్‌ ఉంది. నా టీమ్‌ కృషి వల్లే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించగలిగాం. ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్‌ వర్క్స్‌తో బిజీగా ఉండటం వల్లే నాగచైతన్య ఈ కార్యక్రమానికి రాలేకపోయాడు. ఇక ఈ సినిమా విడుదల గురించి నెగటివ్‌ ఆలోచనలు లేవు. నేనెప్పుడూ పాజిటివ్‌ ఆలోచనలతోనే ముందుకు వెళతాను. ముందుగా రిలీజ్‌ డేట్‌ను ప్రకటిద్దాం. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఆ దేవుడే చూసుకుంటాడు’’ అని అన్నారు.

ఇంకా మాట్లాడుతూ – ‘‘ఆర్‌ఆర్‌ ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ విడుదల వాయిదా పడటం బాధగా ఉంది. వాళ్లెంత కష్టపడ్డారో నాకు తెలుసు. అయినా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ ఉన్నా కూడా ‘బంగార్రాజు’ను విడుదల చేసేవాళ్లం. సంక్రాంతికి కనీసం మూడు సినిమాలు రావాలి. 2016 సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా వచ్చినప్పుడు కూడా 4 సినిమాలు విడుదలయ్యాయి. నా కెరీర్‌కు ‘ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, జానకిరాముడు’లా నాగచైతన్యకు ‘బంగార్రాజు’ ప్లస్‌ అవుతుందని నమ్ముతున్నాను’’ అన్నారు నాగార్జున.

‘‘ఈ సినిమాలో నాగార్జునగారికి, నాగచైతన్యలకు సమానమైన సన్నివేశాలు ఉంటాయి. ప్రసాద్‌గారు నాకు సోదరుడు వంటివారు. బాగా సహకరించారు. అనూప్‌ రూబెన్స్‌ అద్భుతమైన పాటలు అందించారు’’ అని కల్యాణ్‌ కృష్ణ అన్నారు. ‘‘నాగార్జునగారి ఎనర్జీని ఎవ్వరితోనూ మ్యాచ్‌ చేయలేం. చైతన్యతో పని చేయడం ఈజీ. సర్పంచ్‌ నాగలక్ష్మి (సినిమాలో కృతీ పాత్ర పేరు) పటాకాలా అనిపిస్తుంది. ఈ పాత్రను ఎంజాయ్‌ చేస్తూ చేశాను’’ అని కృతీ శెట్టి అన్నారు.

‘‘బంగార్రాజు’ సినిమా ఆఫర్‌ మాకు రావడంతో ఇది నిజంగానే బంగారం లాంటి సినిమా అనుకున్నాం. నాగార్జునగారు, నాగచైతన్య కలిసి నటించడంతో సినిమా ఇంకా ప్రతిష్టాత్మకంగా మారింది’’ అని జీ అధినేత ప్రసాద్‌ అన్నారు. ‘‘లడ్డుందా, వాసివాడి తస్సాదియ్యా’ పాటలకు మంచి స్పందన వచ్చింది. ‘సోగ్గాడే..’లో ‘డిక్క డిక్క డుం డుం..’ పాటను నాగ్‌ సార్‌తో పాడించాం. ఇందులో కూడా పాడించాలని అనుకున్నాం. ‘లడ్డుందా...’ పాట విన్నాక మొత్తం పాడేస్తా అన్నారు నాగార్జునగారు’’ అని సంగీతదర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ అన్నారు. 

 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top