
‘డెకాయిట్’ కోసం హైదరాబాద్ చేరుకున్నారు మృణాల్ ఠాకూర్. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఇంటెన్స్ యాక్షన్ లవ్‌స్టోరీ చిత్రం ‘డెకాయిట్’. ‘ఏక్ ప్రేమ్ కథ’ అనేది ట్యాగ్‌లైన్. షనీల్ డియో డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. తాజాగా ఈ సినిమా సెట్స్‌లోకి అడుగుపెట్టారు మృణాల్ ఠాకూర్. ‘డెకాయిట్’ సినిమా సెట్స్‌లోకి జాయిన్ అయినట్లుగా తన ఇన్‌స్టా అకౌంట్‌లో కన్ఫార్మ్ చేశారీ బ్యూటీ. ఈ కీలక షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ దాదాపు తుది దశకు చేరుకుంటుందట.
ఇద్దరు మాజీ ప్రేమికులు తమకు ఇష్టం లేకపోయినా ఓ క్రైమ్‌ను కలిసి చేయాల్సి వస్తే ఏం జరుగుతుంది? అన్నదే ఈ సినిమా కథాంశమనే ప్రచారం సాగుతోంది. అంతేకాదు... ఈ సినిమాలోని కొంత భాగం రాయలసీమ నేపథ్యంలో ఉంటుందని, మదనపల్లె యాసలో అడివి శేష్ క్యారెక్టర్ ఉంటుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ దర్శక–నిర్మాత–నటుడు అనురాగ్ కశ్యప్‌పోలీస్ ఆఫీసర్‌గా చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది.