
పీ రాజగోపాల్.. ఈ పేరు దేశవ్యాప్తంగా పరిచయమే.. తమిళనాడులో శరవణ భవన్ చెయిన్ రెస్టారెంట్‌ల వ్యవస్థాపకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఓ మారుమూల పల్లెలో రైతు కుటుంబంలో పుట్టి.. పెద్దగా చదువుకోకుండానే హోటల్ రంగంలో ఆకాశమంత ఎత్తుకు ఎదిగాడు. కోట్ల రూపాయలు సంపాధించాడు. అయితే, తన జాతకాల పిచ్చి వల్ల ఒక మహిళ జీవితం నాశనం కావడం ఆపై అతని జీవితం కూడా అగ్గిలో కాలిపోయింది. ఇప్పుడు అతని బయోపిక్ వెండితెరపైకి రానుంది. ఇప్పటికే ఈ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజాగా ఈ చిత్రంలో నటించేందుకు స్టార్ హీరో అంగీకరించినట్లు తెలుస్తుంది.

జై భీమ్, వేట్టాయాన్ వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్.. తాజాగా ఈ దర్శకుడు తన మూడవ చిత్రానికి సిద్ధమయ్యాడు. సరవణ భవన్ హోటల్ యజమాని రాజగోపాల్ జీవిత ఇతివత్తంతో చిత్రాన్ని చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. ఇందులో రాజగోపాల్, జీవజ్యోతి అనే మహిళ మధ్య జరిగిన ప్రేమ పోరాటం, రాజగోపాల్ జైలు పాలైన సంఘటనలు ప్రధానాంశంగా ఉంటాయని దర్శకుడు పేర్కొన్నారు. దీనికి దోసెకింగ్ అనే టైటిల్ కూడా నిర్ణయించారు. ఇందులో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ను నటింపజేసేందుకు మరోసారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జంగ్లి పిక్చర్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా కోసం మోహన్‌లాల్ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దోసెకింగ్ చిత్రంలో నటించడానికి మోహన్ లాల్ ఓకే చెబుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
జ్యోతిష్యం పిచ్చి.. దహించేసిన 'కామాగ్ని'
‘శరవణ భవన్’ పి.రాజగోపాల్‌ను చెన్నై వచ్చిన కొత్తల్లో ఒక జ్యోతిష్యుడు ఏదైనా ‘అగ్ని’తో ముడిపడిన వ్యాపారం పెట్టు అన్నాడు. రాజగోపాల్ ‘శరవణ భవన్’ రెస్టరెంట్ పెట్టి, సక్సెస్ అయ్యి, 22 దేశాల్లో తన హోటల్ సామ్రాజ్యాన్ని విస్తరించి 30 వేల కోట్ల సంపదకు ఎగబాకాడు. జ్యోతిష్యుడు చెప్పింది నిజమైంది. అయితే అగ్నితో పోల్చే ‘కామాగ్ని’తో అదే రాజగోపాల్ అంత పేరూ దహించుకుపోవడమూ ఈ జోస్యంలో ఉంది.
జీవజ్యోతితో పెళ్లి కోసం..
జీవజ్యోతి ఎంతో చలాకీ అమ్మాయి. చదువుకుంటున్న అమ్మాయి. శరవణ భవన్‌లో పని చేసే అసిస్టెంట్ మేనేజర్ కూతురిగా పి.రాజగోపాల్‌కు 1996లో పరిచయం అయ్యింది. అప్పటికే రాజగోపాల్ ‘దోసె కింగ్’ గా చెన్నైలో పేరు గడించాడు. అతనికి 1972లో ఒక వివాహం (ఇద్దరు కొడుకులు), 1994లో మరో వివాహం చేసుకున్న రాజగోపాల్ జీవజ్యోతిని మూడో వివాహం చేసుకోవాలనుకున్నాడు. దానికి కారణం కూడా జోతిష్యమే.‘మీ ఇద్దరి జాతకాలు కలిశాయి. ఆమెను చేసుకుంటే నువ్వు మరిన్ని ఘనవిజయాలు సాధిస్తావు’ అని ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటలతో ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే జాతకం ఒకటి తలిస్తే జీవజ్యోతి మరొకటి తలిచింది.
ట్యూషన్ మాస్టర్‌తో ప్రేమ
జీవజ్యోతి పి.రాజగోపాల్‌ను తన గార్డియన్‌గా భావించింది. పెద్దాయన అభిమానం ప్రదర్శిస్తున్నాడనుకుంది తప్ప అతని మనసులో ఏముందో ఊహించలేకపోయింది. ఈలోపు ఆమె శాంతకుమార్ అనే లెక్కల ట్యూషన్ మాస్టర్ ప్రేమలో పడి 1999లో పెళ్లి చేసుకోవడానికి పారిపోయింది. ఆమె మీద అప్పటికే కన్ను వేసి ఉన్న రాజగోపాల్ ఆ జంటను చెన్నై రప్పించి కాపురం పెట్టించాడు. కాని 2000 సంవత్సరంలో శాంతకుమార్‌ను బెదిరించి జీవజ్యోతితో తెగదెంపులు చేసుకోమన్నాడు. దీనికి జీవజ్యోతి,శాంతకుమార్ ఒప్పుకోలేదు.
జీవజ్యోతి భర్త హత్య
జీవజ్యోతిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న రాజగోపాల్ తన దగ్గర పని చేసే డేనియల్‌తో 5 లక్షలకు డీల్ మాట్లాడుకుని శాంతకుమార్‌ను చంపించే పథకం పన్నాడు. అయితే డేనియల్ శాంతకుమార్‌ను కనికరించి ఐదువేలు ఇచ్చి ముంబై పారిపోమని చెప్పాడు. రాజగోపాల్‌తో శాంతకుమార్‌ను హత్య చేశానని చెప్పేశాడు. అయితే శాంతకుమార్ జీవజ్యోతికి ఫోన్ చేసి జరిగింది చెప్పడంతో ‘నువ్వు వచ్చేసెయ్. రాజగోపాల్ కాళ్లమీద పడి వదిలేయ్‌మని అడుగుదాం’ అనేసరికి అతను వచ్చాడు. ఇద్దరూ రాజగోపాల్ దగ్గరకు వెళ్లారు. దీంతో కోపం పట్టలేకపోయిన రాజగోపాల్ అక్టోబర్ 28న వాళ్లను తన మనుషులతో తీసుకెళ్లాడు. అక్టోబర్ 31న శాంతకుమార్ శవం అడవిలో దొరికింది. జీవజ్యోతి ఈ దెబ్బతో పూర్తిగా దారికొస్తుందని భావించిన రాజగోపాల్ ఆమెను ఇంటికి వెళ్లనిచ్చాడు. అయితే ఆమె నేరుగా చెన్నై పోలీస్ కమిషనర్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడంతో దోసె కింగ్ సామ్రాజ్యం ఉలిక్కిపడింది.
ఒంటరి పోరాటం
రాజగోపాల్‌కు ఉన్న పలుకుబడి ముందు జీవజ్యోతి ఎటువంటి ప్రలోభాలకు, వొత్తిళ్లకూ లొంగలేదు. తనకు అన్యాయం జరిగిందని గట్టిగా నిలబడి న్యాయం కోసం పోరాడింది. అయితే రాజగోపాల్ కేవలం 9 నెలలు మాత్రం జైలులో ఉండి తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. అతను జైలులో ఉన్న కాలంలో మంచి భోజనం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. 2004లో సెషన్స్ కోర్టు రాజగోపాల్‌కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
దాని మీద రాజగోపాల్ హైకోర్టుకు అప్పీలు చేయగా 2010లో చెన్నై హైకోర్టు మరింత శిక్ష పెంచుతూ యావజ్జీవం చేసింది. దీనిపై సుప్రీం కోర్టులో పోరాడాడు రాజగోపాల్. ఇంత జరుగుతున్నా జీవజ్యోతి ప్రతి చోటా తన న్యాయపోరాటం కొనసాగించింది. 2019 మార్చిలో సుప్రీం కోర్టు హైకోర్టు శిక్షనే బలపరిచి జూలై 7, 2019న లొంగిపోవాలని రాజగోపాల్‌ను ఆదేశించగా అప్పటికే జబ్బుపడ్డ రాజగోపాల్ జూలై 9న అంబులెన్స్‌లో వచ్చి కోర్టులో లొంగిపోయాడు. కాని ఆ వెంటనే విజయ హాస్పిటల్ ప్రిజనర్స్ వార్డ్‌కు తరలించాల్సి వచ్చింది. గుండెపోటుతో అతడు జూలై 18న మరణించాడు.