మిరాజ్ మూవీ రివ్యూ: ఇది ట్విస్ట్ ల మిస్టరీ! | Mirage Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

OTT: మిరాజ్ మూవీ రివ్యూ: ఇది ట్విస్ట్ ల మిస్టరీ!

Oct 30 2025 4:04 PM | Updated on Oct 30 2025 4:13 PM

Mirage Movie Review And Rating In Telugu

సినిమా పరంగా ఓ కథను ప్రేక్షకుడికి ఆకట్టుకునేలా చెప్పాలంటే గట్టి పట్టున్న స్క్రీన్ ప్లే ఎంతైనా అవసరం. మామూలు రొటీన్ ఫార్ములాతో వచ్చే సినిమాలు నేటి ప్రేక్షకులకు అంతగా రుచించట్లేదు. చెప్పే కథను ఊహకందని ట్విస్టులతో చూపిస్తే ఆ సినిమా హిట్టే. అదే కోవకు చెందిన సినిమా మిరాజ్(Mirage). ఈ సినిమా మాతృక మళయాళమైనా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా సోనీ లివ్ లో లభ్యమవుతోంది. 

అపర్ణ రాసిన ఈ కథకు ప్రముఖ మళయాళ దర్శకులు జీతూజోసెఫ్ దర్శకత్వం వహించారు. సుప్రసిద్ధ మళయాళ నటులు ఆసిఫ్ అలీ, అపర్ణా బాలమురళి ఈ సినిమాకు ప్రధాన తారాగణం. ఈ మధ్య కాలంలో ఆసాంతం సూపర్ ట్విస్టులతో సాగిపోయే సినిమా ఇదేనని చెప్పుకోవచ్చు. 

ప్రారంభంలో చాలా నెమ్మదిగా ప్రారంభమైనా శుభం కార్డు వరకు ట్విస్టులతో ప్రేక్షకుల మతిని పోగొడుతుందీ సినిమా. అయితే ఈ సినిమాలో అక్కడక్కడా కొంచం రీరికార్డింగ్ నిరాశపరుచవచ్చు. కాని సినిమా ట్విస్టుల పరంగా చూస్తే మాత్రం గడిచిన దశాబ్ద కాలంలో ఇటువంటి సినిమా రాలేదనుకోవచ్చు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓ సారి చూద్దాం. 

సినిమా ప్రారంభంలోనే ఓ ట్రైన్ యాక్సిడెంతో కథ మొదలవుతుంది. ఈ ట్రైన్ లో కిరణ్ అనే పాత్ర పరిచయమవుతుంది. అభిరామి, కిరణ్ ఒకే ఆఫీసులో పని చేస్తూ ఉంటారు. అంతేకాదు వాళ్ళిద్దరూ ప్రేమించుకుని త్వరలో పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటారు. ఇంతలో కిరణ్ ట్రైన్ యాక్సిడెంట్ గురించి అభిరామికి తెలిసి కుప్పకూలిపోతుంది. అభిరామిని ఓదార్చడానికి తన స్నేహితురాలైన రితిక వస్తుంది. ఆ తరువాత ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన అశ్విన్, పోలీస్ సూపరిండెంట్ ఆరుముగంతో పాటు ఆఫీసులో రాజకుమార్ మనిషి కూడా అభిరామి దగ్గరకు వస్తారు. 

వీళ్ళంతా అభిరామిని పరమార్శించడానికైతే కాదు, చనిపోయిన కిరణ్ దగ్గరున్న ఓ డేటా డ్రైవ్ కోసం వస్తారు. ఇంతకీ ఆ డేటా డ్రైవ్ లో ఏముంది, ఆఖర్లో అది ఎవరికి దక్కుతుంది అన్నది తెలుసుకోవాలంటే ఈ ట్విస్టుల మిస్టరీ మిరాజ్ ని చూడాల్సిందే. గమ్మత్తేమిటంటే ఈ సినిమాలో కనిపించే ప్రతి పాత్ర ఓ ట్విస్ట్ తోనే ఉంటుంది. అది కూడా ప్రేక్షుకుడి ఊహలకు అంచనాలు మించి ఉంటాయి ఈ ట్విస్టులు. మంచి థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడేవాళ్ళకి ఈ గ్రిప్పింగ్ థ్రిల్లర్ కనువిందనే చెప్పాలి. మస్ట్ వాచ్ మూవీ దిస్ మిరాజ్, సో గెట్ ట్విస్టెడ్ దిస్ వీకెండ్.
-హరికృష్ణ ఇంటూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement