‘ధమాకా’ తర్వాత రవితేజ ఖాతాలో సరైన హిట్టే పడలేదు. శ్రీలీల పరిస్థితి కూడా అంతే. ఇద్దరి నుంచి వరుస సినిమాలు వస్తున్నా.. ‘ధమాకా’ స్థాయి హిట్ మాత్రం రాలేదు. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలనే కసితో ఇద్దరు జోడీగా ‘మాస్ జాతర’(Mass Jathara Movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘ధమాకా’ చిత్రానికి సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియోనే ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘మాస్ జాతర’(Mass Jathara Movie Review )పై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘మాస్ జాతర’ అందుకుందా? రవితేజ ఖాతాలో హిట్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
లక్ష్మణ్ భేరి(రవితేజ) పవర్ఫుల్ రైల్వే పోలీసు అధికారి. రైల్వే స్టేషన్ పరిధిలో నేరాలు జరగకుండా చూసుకునే బాధ్యతే తనది. కానీ దాంతో పాటు ఆ ప్రాంతంలో ఎలాంటి నేరాలు జరిగినా.. ఆయన ఎంటర్ అవుతుంటారు. ఓ కేసు విషయంలో మంత్రి కొడుకుని కొట్టి.. వరంగల్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా అడవివరం గ్రామానికి ట్రాన్స్ఫర్ అవుతాడు. ఈ గ్రామం మొత్తం శివుడు(నవీన్ చంద్ర) కంట్రోల్లో ఉంటుంది.
అక్కడి రైతులతో గంజాయి పండించి..కోల్కత్తాకు సరఫరా చేయడం ఆయన పని. లక్ష్మణ్ భేరీ వచ్చీరావడంతోనే శివుడు చేసే స్మగ్లింగ్ పనికి ఎదురుతిరుగుతాడు. కానీ ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులు మొత్తం శివుడికి సపోర్ట్గా నిలుస్తారు. కేవలం రైల్వే స్టేషన్ పరిధిమేర మాత్రమే అధికారాలు ఉన్న లక్ష్మణ్..శివుడి దందాని ఎలా అడ్డుకున్నాడు? ఈ కథలో శ్రీలీల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘మాస్ జాతర’ చూడాల్సిందే.
ఎలా ఉందంటే...
కమర్షియల్ సినిమాకు కొత్త కథ అవసరం లేదు. హీరోకి భారీ ఎలివేషన్స్, బలమైన విలన్.. మాస్ డైలాగ్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటే చాలు. ఇవన్నీ ‘మాస్ జాతర’లో ఉన్నాయి. కానీ వాటిని ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు భాను భోగవరపు పూర్తిగా సఫలం కాలేదు. కథ-కథనం పక్కకి పెట్టి..కేవలం రవితేజ ఫ్యాన్స్ కోరుకునే అంశాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అవి కొంతవరకు ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేసినా.. సాధారణ ప్రేక్షకులకు మాత్రం రొటీన్‌గానే అనిపిస్తాయి.
ఎంత కమర్షియల్ సినిమా అయినా కొన్ని చోట్ల అయినా వాస్తవికంగా అనిపించాలి. కానీ ఈ సినిమా అలా ఎక్కడ అనిపించదు. రవితేజ పాత్ర ఒకచోట తెలంగాణ యాస మాట్లాడితే..మరికొన్ని చోట్ల సాధారణ భాష మాట్లాడుతుంది. హీరోయిన్ పాత్ర శ్రీకాకుళం యాస మాట్లాడితే.. ఆమె తండ్రి మాత్రం సాధారణ భాషలో మాట్లాడతాడు. సీరియస్‌గా ఉండే హీరో..హీరోయిన్ కనిపించగానే కామెడీ చేస్తుంటాడు. లవ్‌ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోదు. హీరో-తాతయ్యల మధ్య వచ్చే సన్నివేశాలు అటు పూర్తిగా నవ్వించ లేదు.. ఇటు ఎమోషనల్‌గానూ ఆకట్టుకోలేకపోయాయి.
ఆసక్తికర సన్నివేశంతో కథను ప్రారంభించాడు. రవితేజ ఎంట్రీ సీన్ ఆకట్టుకునేలా ఉంటుంది. కానీ ఆ తర్వాత కాసేపటికే కథనం రొటీన్‌గా సాగుతుంది. తాత(రాజేంద్రప్రసాద్) తో లక్ష్మణ్ భేరీ చేసే కామెడీ కొంతమేర నవ్విస్తుంది. ఇక హీరో అడవివరం వెళ్లిన తర్వాత కథనంలో మార్పు ఉంటుందని ఆశించినా...అక్కడ నిరాశే ఎదురవుతుంది. శివుడి ఎంట్రీ వరకు అద్బుతంగా చూపించి.. మళ్లీ రోటీన్‌గానే కథని ముందుకు నడిపించారు. క్లైమాక్స్.. ఇటీవల వచ్చిన చాలా సినిమాలు గుర్తుకు చేస్తుంది. కథ-కథనం రొటీన్‌గా ఉన్నా.. యాక్షన్ సీన్లు మాత్రం ఆకట్టుకుంటాయి. శివుడి మామ గ్యాంగ్‌తో వచ్చే పోరాట ఘట్టాలు సినిమాకు హైలెట్. ఇక క్లైమాక్స్ యాక్షన్ సీన్ కూడా అదిరిపోతుంది. కథ-కథనం విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉంటే..‘మాస్ జాతర’ ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
రవితేజ ఎనర్జీ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. అందులోనూ పోలీసు పాత్రలు ఆయన అవలీలగా చేసేస్తాడు. రైల్వే పోలీసు అధికారి లక్ష్మణ్ భేరీ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాడు. డ్యాన్స్ కూడా బాగానే చేశారు. ఫ్యాన్స్ కోరుకునేలా తెరపై కనిపించి అలరించాడు.
ఇక శివుడి పాత్రలో నవీచంద్రం విలనిజం అద్భుతంగా పండించాడు. ఆయనలోని కొత్త యాంగిల్ ఇందులో కనిపిస్తుంది. తులసి పాత్రకు శ్రీలీల న్యాయం చేసింది. హీరో తాతగా రాజేంద్ర ప్రసాద్ కొంతమేర నవ్వించే ప్రయత్నం చేశాడు. హైపర్ ఆది, వీటీవీ గణేష్, అజయ్ ఘోష్‌తో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు బాగున్నా..వాటి ప్లేస్‌మెంట్ సరిగా లేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్


