
సినిమా ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు ప్రాధాన్యం లేదని, ఇక్కడివారికి పెద్దగా అవకాశాలివ్వరనేది ఎప్పటినుంచో ఉన్న వాదన! అయితే అదే నిజమంటోంది ప్రముఖ నటుడు మోహన్‌బాబు కూతురు, నటి మంచు లక్ష్మి ప్రసన్న (Manchu Lakshmi Prasanna). ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను నటిస్తానంటే తెలుగులో బోలెడుమంది దర్శకనిర్మాతలు నాకు ఛాన్సిచ్చేందుకు రెడీగా ఉన్నారని అందరూ అనుకుంటారు.
తెలుగువారిని తీసుకోరెందుకో?
కానీ, అది నిజం కాదు. చాలామంది కన్నడ, తమిళ, మలయాళ భాషల నుంచి నటీమణుల్ని సెలక్ట్ చేసుకుని సినిమాలు చేస్తున్నారు. కొన్నిసార్లు ఆ సినిమాలు చూసినప్పుడు ఆ క్యారెక్టర్‌లో నేనైతే బాగుండేదాన్నేమో అనిపించేది. వెంటనే దర్శకనిర్మాతలకు ఫోన్ చేసి నన్నెందుకు పెట్టుకోలేదు? అని తిట్టేదాన్ని. తెలుగువాళ్లతో పని చేయించుకోవడం తెలుగువాళ్లకే ఇష్టం లేదు. ఇక్కడివారిని సెలక్ట్ చేసుకోవడానికి తెగ బాధపడుతుంటారు. అదెందుకో నాకూ అర్థం కావడం లేదు. నేను సమయానికి సెట్‌కి వచ్చి బుద్ధిగా పని చేస్తాను. ఎవరినీ, ఏమీ ఇబ్బంది పెట్టను.
చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది
పైగా ఇప్పటివరకు ప్రతి నిర్మాత నాకు డబ్బులెగ్గొట్టాడే తప్ప నేనెవరికీ డబ్బులెగ్గొట్టలేదు. నా చివరి సినిమా డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వనేలేదు. అడిగితే సినిమా కష్టాలు చెప్తారు. సరేలే, పాపం.. సినిమా ముందుకెళ్లాలి కదా అని షూటింగ్ పూర్తి చేస్తాం. తీరా చూస్తే పిల్లలపై ఒట్లు వేస్తారు, కానీ, డబ్బు మాత్రం ఇవ్వరు. ఇవన్నీ చూసి నిరాశచెందాను. మరో విషయం నాకు ఆర్థిక క్రమశిక్షణ లేదు. ఈ విషయం చెప్పడానికి సిగ్గుగా ఉంది. ఎప్పుడూ దీని గురించి అంతగా ఆలోచించలేదు. నేను సంపాదించిందంతా టీచ్ ఫర్ చేంజ్ వంటి సామాజిక సేవకే ఉపయోగించాను.
చెప్పుడుమాటలు విని బతికా
కానీ, నాకంటూ కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని ఆలోచించలేదు. ఇప్పుడిప్పుడే డబ్బు ఆదా చేయడం మొదలుపెట్టాను. మనల్ని మనమే చూసుకోవాలి.. ఎవరూ వచ్చి ఏదీ చేయరు. నా జీవితమంతా చెప్పుడుమాటలు విని బతికేశాను. ఇందులో ఎవర్నీ తప్పుపెట్టడం లేదు. సినిమాల్లేనప్పుడు నేనూ ఇంకో దారి చూసుకోవాలి. అందుకే చీరల బిజినెస్ ప్రారంభించాను. దక్షిణాది స్పెషల్ చీరలను నార్త్‌కు పరిచయం చేస్తున్నాను అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది.