
మంచు లక్ష్మీ ప్రసన్న (Lakshmi Manchu) తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటి, నిర్మాత, టీవీ ప్రెజెంటర్‌గా పేరు పొందారు. చాలారోజుల తర్వాత ఆమె 'దక్ష' అనే యాక్షన్ సినిమాలో నటించారు. శ్రీలక్ష్మిప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటైర్టెన్మెంట్స్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో తన ఆర్థిక పరిస్థితి గురించి చెప్పుకొచ్చారు. తనకు అప్పులు ఉన్నాయనే రూమర్స్ గురించి క్లారిటీ ఇచ్చారు.
ఆ ఇంటితో నాకు సంబంధం లేదు
మంచు లక్ష్మీ సుమారు రెండేళ్ల క్రితమే హైదరాబాద్ నుంచి ముంబై షిఫ్ట్ అయిపోయారని తెలిసిందే. అయితే, హైదరాబాద్‌లోని తన ఇల్లు అమ్మకానికి పెట్టారని, చాలా అప్పులు ఉన్నాయని రూమర్స్ వచ్చాయి. ఇదే విషయం గురించి తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఇలా చెప్పారు. 'హైదరాబాద్‌లో నాకు ఇల్లు లేదు. అసలు నేను విక్రయించేందుకు ఇక్కడ ఇల్లు ఉండాలి కదా.. ఫిలిం నగర్‌లో ఉన్న నివాసం నాది కాదు. అక్కడ కేవలం ఉండేదానిని మాత్రమే.. ఆ ఇంటి గురించి వివరాలు కావాలంటే మా నాన్నను అడగండి చెప్తారు.
ఆ ఇంటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఆ ఇంట్లో ఉండేందుకు నాన్న ఇచ్చారు. ఆ ఆస్థి నాది కాదు, నాన్నకు సొంతం. నా ఇష్ట ప్రకారమే ముంబై వెళ్లిపోయాను. అక్కడ ఇంటి అద్దె చెల్లించడానికి ఇబ్బందిగా ఉన్నా సరే ఉన్నంతలో సరిపెట్టుకుంటున్నాను. డబ్బు సాయం చేయమని నాన్నను అడగలేదు. సినిమాలు, షోల ద్వారా వచ్చిన డబ్బుతో ముందుకు వెళ్తున్నాను.' అని లక్ష్మీ ప్రసన్న చెప్పారు.
మొదటి నుంచి మంచు లక్ష్మీ తన కష్టంతో వచ్చిన డబ్బుతోనే ముందుకు వెళ్లాలి అనుకునే సంకల్పంతో ఉంటారు. అమెరికాలో ఆమె చదువుతున్నరోజుల్లో కూడా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేసేవారని తెలిసిందే. తన తండ్రి వారసత్వం కంటే తనలోని టాలెంట్‌తోనే ఆమె గుర్తింపు పొందారు. ఆమె బహుముఖ ప్రతిభ కలిగిన వ్యక్తిగా, భారతీయ సినిమాతో పాటు అమెరికన్ టెలివిజన్‌లో కూడా తన ప్రతిభను చాటారు. మంచు లక్ష్మీ తన వ్యక్తిత్వం, ధైర్యం, బలమైన అభిప్రాయాలతో తెలుగు సినీ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారనిది వాస్తవం అని చెప్పొచ్చు.