సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు ఈఏ రాజేంద్రన్ తీవ్ర అనారోగ్యంతో (71) కన్నుమూశారు. కేరళలోని కొల్లాం జిల్లా పట్టతానంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నాటకరంగంతో పాటు సినిమా, టీవీ రంగాల్లో సేవలందించారు. ఆయన చేసిన సేవలకు గాను రాజేంద్రన్ మలయాళ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు.
తన కళా జీవితాన్ని నాటకరంగంలో ప్రారంభించిన రాజేంద్రన్.. సినిమాల్లోకి రాకముందు రంగస్థల నటుడిగా మంచి పేరు సంపాదించారు. తన కెరీర్‌లో దాదాపు 60 చిత్రాలలో నటించారు. విలన్‌గా, సహాయ పాత్రలతో అభిమానులను మెప్పించారు. పలు సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలో ఫేమస్ అయ్యారు. కేరళ త్రిస్సూర్ జిల్లాలోని త్రితల్లూరులో గల ఎంగూర్ తారవాడులో అయ్యప్పన్, సుమతి దంపతులకు రాజేంద్రన్ జన్మించారు. చిన్న వయసులోనే కళలపై ఆసక్తి కనబరిచారు. పూణేలోని ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో టెలివిజన్ కోర్సు అభ్యసించిన ఆయన.. ప్రముఖ నటుడు మాధవన్ కుమార్తె సంధ్యను వివాహం చేసుకున్నారు.
వీఆర్ గోపీనాథ్ దర్శకత్వం వహించిన గ్రీష్మం చిత్రంతో రాజేంద్రన్ తొలిసారిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ తర్వాత రాజేంద్రన్‌కు సినిమారంగంలో అవకాశాలొచ్చాయి. జయరాజ్ దర్శకత్వం వహించిన కాళియాట్టం చిత్రంలోనూ నటించారు. అంతేకాకుండా ప్రణయ వర్ణంగల్, దయ, పట్టాభిషేకం వంటి మూవీస్‌లో కూడా కనిపించారు. అంతేకాకుండా రాష్ట్ర ఉద్యానవన సంస్థ అధ్యక్షుడిగానూ రాజేంద్రన్ సేవలందించారు.


