
దసరా విలన్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో మరోసారి వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఇటీవల ప్రముఖ నటి విన్సీ అలోషియస్ ఆరోపణలతో ఆయనపై మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చర్యలకు తీసుకునేందు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఆయనపై డ్రగ్స్ ఆరోపణలు రావడంతో పోలీసులు రైడ్ చేయడంతో ఓ హోటల్ నుంచి పారిపోయాడని కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో షైన్ టామ్ చాకో పేరు మలయాళ ఇండస్ట్రీలో మార్మోగిపోతోంది.
అయితే అతను తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తోన్న విన్సీ ఆసక్తికర కామెంట్స్ చేసింది. టామ్ చాకోపై తానేలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకోవడం లేదని తెలిపింది. ఈ సమస్యను చిత్ర పరిశ్రమలో కాకుండా అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ విషయంపై ఇప్పటికే కేరళ ఫిల్మ్ ఛాంబర్, అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసిసి)కి దాఖలు చేసిన ఫిర్యాదును మాత్రం ఉపసంహరించుకోబోనని ఆమె తెలిపారు. ఇప్పటికైనా మలయాళ చిత్ర పరిశ్రమలో మార్పు రావాలని కోరుకుంటున్నానని విన్సీ తెలిపారు. అందుకే తాను ఫిర్యాదుతో ముందుకు వెళ్లానని విన్సీ అలోషియస్ చెప్పారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదని ఆమె పేర్కొన్నారు.
కాగా.. ఓ మూవీ షూట్ సమయంలో షైన్ టామ్ చాకో తన దుస్తులను సరిచేయమని పట్టుబట్టాడని ఆరోపిస్తూ విన్సీ అలోషియస్ ఫిర్యాదు చేసింది. వీరిద్దరు కలిసి నటించిన 'సూత్రవాక్యం' సెట్స్‌లో టామ్ డ్రగ్స్ వాడాడని కూడా ఆమె ఆరోపించింది. తన ఫిర్యాదుపై అంతర్గత కమిటీ విచారణకు సహకరిస్తానని నటి తెలిపింది. కాగా.. విన్సీ అంతకుముందు తన ఫిర్యాదును ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొంది. షైన్ టామ్ చాకో పేరును కేరళ ఫిల్మ్ ఛాంబర్ జనరల్ సెక్రటరీ సాజీ నంతియట్టు మీడియాకు వెల్లడించారని ఆమె పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో అతని పేరును బయటికి చెప్పినందుకు తాను క్షమాపణలు కోరుతున్నానని విన్సీ తెలిపింది.