మహేశ్‌బాబు(Mahesh Babu) అభిమానులు గుంటూరు కారం సినిమా తర్వాత ఆయన్ను వెండితెరపై మళ్లీ చూసేందుకు ఆశ పడుతున్నారు. ఈ క్రమంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB29 ప్రాజెక్ట్ అప్డేట్ కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే నాలుగు షెడ్యూల్ పైగానే పూర్తి చేసుకుంది. ఒరిస్సా, కెన్యా, వంటి ప్రదేశాల్లో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంది. నైరోబి, టాంజానియాల్లో కొత్త షెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తోంది. అయితే, నవంబర్ 16న సినిమా టైటిల్తో పాటు మహేశ్ ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. అందుకోసం గ్రాండ్గా ఒక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
SSMB29 ప్రాజెక్ట్ గురించి నవంబర్ 16న హైదరాబాద్‌లో ఒక భారీ ఈవెంట్ను ఏర్పాటు చేయాలని రాజమౌళి ఉన్నారట. సినిమా టైటిల్ గ్లింప్స్ వీడియోను ఆవిష్కరించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయనున్నారని తెలుస్తోంది. అయితే, ఈ కార్యక్రమాన్ని అందరూ చూసేందుకు వీలు ఉండేందుకు ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్లో ప్రత్యక్ష ప్రసారం చేయనుందట. ఈ అంశం గురించి త్వరలో అధికారికంగా ప్రకటన కూడా రావచ్చని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా , పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్తో పాటు మరికొందరు సెలబ్రిటీలు పాల్గొననున్నారని సమాచారం.
ఇండియన్ సినిమా చరిత్రలో ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి చూపించబోతున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్.నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2027 ప్రారంభంలో విడుదల చేయాలని చూస్తోంది.


