దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించిన యానిమేటెడ్ చిత్రం ‘మహావతార్: నరసింహ’. గతేడాదిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ప్రముఖ నిర్మాణసంస్థ హోంబలే ఫిల్మ్స్ (hombale films) నిర్మించిన ఈ చిత్రం ఏకంగా రూ. 300 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. యానిమేషన్‌లో ఈ చిత్రం ఒక బెంచ్ మార్క్‌ను సెట్ చేసింది.
యానిమేషన్ చిత్రాల పరంగా అరుదైన రికార్డు నెలకొల్పిన ‘మహావతార్ నరసింహ’కు కొనసాగింపుగా పలు చిత్రాలు రానున్నాయి. ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా రెండేళ్లకు ఒకటి చొప్పున మొత్తం ఏడు సినిమాలు వస్తాయని దర్శకుడు ఇప్పటికే ప్రకటించారు. ఇందులో విష్ణుమూర్తి దశావతారాలకు సంబంధించిన కథ ఉంటుందన్నారు. ఈ యూనివర్స్ నుండి రెండవ చిత్రం త్వరలో విడుదల కానుంది.
ఈ చిత్ర టైటిల్‌ను నేడు ఆదివారం ఉదయం 11:22 గంటలకు వెల్లడిస్తారు. (మహావతార్ పరశురామ్) టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మొదటి భాగం వరాహ, నరసింహ అవతారాలను చూపించగా, తదుపరి చిత్రం పరశురాముడు లేదా విష్ణుమూర్తి అవతారం చుట్టూ తిరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఈ 3D-యానిమేటెడ్ చిత్రాల సిరీస్‌ను అశ్విన్ కుమార్ 12 సంవత్సరాల ప్రణాళికతో రూపొందించారు. ఆధునిక చిత్ర నిర్మాణ పద్ధతులతో ప్రతి అవతారానికి జీవం పోస్తూ, ఈ చిత్రాలన్నీ 2025 నుండి 2037 మధ్య విడుదల కానున్నాయి.


