
లాల్ సింగ్ చడ్డా చిత్రంతో రూ. 200 కోట్టు నష్టాలను ఎదుర్కొన్నట్లు తాజాగా ఆమిర్‌ఖాన్ చెప్పారు . 2022లో విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఈ మూవీకి ఆమిర్, అతడి మాజీ భార్య కిరణ్‌రావ్ సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు ముందు ఆమీర్ నటించిన ప్రతి సినిమా మినిమమ్ రూ. 150 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టాయి. అయితే, లాల్ సింగ్ చడ్డా మూవీకి వచ్చిన నష్టాల గురించి తాజాగా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు.
'ఒక నిర్మాతగా బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. ఏదైనా సినిమా ప్రారంభిస్తే లాభాల కంటే నష్టాలు రాకుంటే చాలు అనే విధంగా నా ప్రణాళిక ఉంటుంది. కానీ, లాల్ సింగ్ చడ్డా మూవీ బడ్జెట్ విషయంలో పొరపాటు చేశాను. వరుస విజయాలు నాకు దక్కడం వల్ల ఈ మూవీ విషయంలో కాస్త అతి నమ్మకం ఏర్పడింది. దీంతో బడ్జెట్‌పై ఎలాంటి పరిమితులు పెట్టుకోలేదు. అందుకే నష్టపోయాను. దంగల్ సినిమాకు రూ. 390 కోట్లు ఇండియాలోనే వచ్చాయి. దీంతో లాల్ సింగ్ చడ్డాకు రూ. 200 కోట్లు వస్తాయని అంచనా పెట్టుకున్నాను. అదే నేను చేసిన పొరపాటు.

ఒక సినిమా రూ. 120 కోట్లు చేస్తుందని అనుకుంటే అప్పుడు మీ బడ్జెట్ రూ. 80 కోట్లు దాటకూడదు. ఇలా ప్లాన్ ఉంటే సేఫ్‌గా ఉంటాం. ఇలాంటి ప్రణాళిక లాల్ సింగ్ చడ్డా సమయంలో చేయలేదు. దీంతో రూ. 200 కోట్ల నష్టాన్ని ఎదుర్కొన్నాం. ఈ సినిమా తెరకెక్కిస్తున్న సమయంలో కరోనా ప్రభావం ఉండటంతో ఎక్కువగా ట్రావెలింగ్‌కు ఖర్చు అయింది. చైనాలో తెరకెక్కించిన ఒక భారీ సీన్ ... ఎడిటింగ్‌లో తొలగించాం. ఆ ఖర్చు అంతా బుడిదలో పోసిన పన్నీరు అయిపోయింది.' అని అన్నారు.
ఈ సినిమాకుగానూ ఆమిర్ రెమ్యూనరేషన్ రూ.50కోట్లు తీసుకున్నాడు. అయితే, ఆ మొత్తం సొమ్ముని వదులుకుని తన సహ నిర్మాతలకు తిరిగిచ్చేశారు. వారికి నష్టాన్ని తగ్గించాలనుకునే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో ఆమిర్ భారీగానే నష్టపోయారు. ‘లాల్ సింగ్ చడ్డా’ బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం. ఈ చిత్రంలో కరీనాకపూర్ హీరోయిన్‌గా నటించగా ప్రముఖ తెలుగు నటుడు నాగచైతన్య కీలకపాత్రలో కనిపించారు.