సింగర్‌ సునీత తనయుడి ప్రేమ కథలో ‘కొత్త మలుపు’ | Singer Sunitha Son Akash Kotha Malupu Movie Set For Release On June 12th, Teaser Release Highlights | Sakshi
Sakshi News home page

సింగర్‌ సునీత తనయుడి ప్రేమ కథలో ‘కొత్త మలుపు’.. టీజర్‌ రిలీజ్‌

Jun 2 2026 12:12 PM | Updated on Jun 2 2026 12:29 PM

Kotha Malupu Teaser Release Highlights

ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కొత్త మలుపు’ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. భైరవి ఆర్థ్యా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శివ వరప్రసాద్ కేశనకుర్తి దర్శకత్వం వహించగా, తాటి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. తథాస్తు క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ మూవీని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయనుంది.

హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్ర టీజర్‌ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు భానుచందర్, ప్రముఖ గాయని సునీత, నిర్మాత సీ కళ్యాణ్, నటుడు రఘుబాబు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

గ్రామీణ నేపథ్యంలోని రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రేమ, సస్పెన్స్, వినోదం సమపాళ్లలో ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. ఆకాష్, భైరవి బావ–మరదళ్ల పాత్రల్లో కనిపించనున్నారు. రఘుబాబు, పృథ్వీ, ప్రభావతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యశ్వంత్ సంగీతం అందించారు.

దర్శకుడు శివ వరప్రసాద్ కేశనకుర్తి మాట్లాడుతూ, “రొమాంటిక్ లవ్ సస్పెన్స్ జానర్‌లో ఈ సినిమాను రూపొందించాం. ఆకాష్–భైరవి జోడీ చాలా బాగా కుదిరింది. కోనసీమ అందాలను తెరపై ఆవిష్కరిస్తూ, మంచి కామెడీతో కూడిన కథను ప్రేక్షకులకు అందిస్తున్నాం. జూన్ 12న సినిమా విడుదల కానుంది” అన్నారు.

గాయని సునీత మాట్లాడుతూ, ‘ఆకాష్ ఎంతో కష్టపడే వ్యక్తి. మంచి స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఇది అతనికి రెండో సినిమా. దర్శకుడు శివ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కథను తీసుకొచ్చారు. మైత్రి సంస్థ ఈ చిత్రానికి అండగా నిలవడం గర్వకారణం” అన్నారు.

హీరో ఆకాష్ మాట్లాడుతూ..‘ఈ చిత్రానికి మంచి కథ అందించిన దర్శకుడికి కృతజ్ఞతలు. మైత్రి మూవీస్ వంటి సంస్థ మద్దతు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. మా అమ్మ సునీతతో పాటు చిత్ర యూనిట్ అందరికీ ధన్యవాదాలు’అన్నారు.

హీరోయిన్ భైరవి ఆర్థ్యా మాట్లాడుతూ, ‘నా కెరీర్‌లో ‘కొత్త మలుపు’ చాలా ప్రత్యేకమైన చిత్రం. ప్రేమ, సస్పెన్స్, హాస్యం కలగలిపిన ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. ఆకాష్‌తో నా జోడీ, బావ–మరదళ్ల పాత్రలు ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయి’ అని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
Advertisement