
ప్రముఖ తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు (Kota Srinivasa Rao) మృతితో చిత్రపరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. లెజెండరీ నటుడు ఇక లేరన్న వార్తను సినీతారలు జీర్ణించుకోలేకపోతున్నారు. కోట శ్రీనివాసరావు ఆదివారం (జూలై 13) ఉదయం ఫిలింనగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన పార్థివదేహానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు అనిల్ రావిపూడి సైతం నటుడిని చివరిసారి సందర్శించి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపాడు.
కూర్చోనైనా నటిస్తా..
ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. కోట శ్రీనివాసరావుగారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. దర్శకుడిగా ఆయనతో కలిసి పనిచేయలేదు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్‌గా చాలా చిత్రాలకు పని చేశాను. గొప్ప టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్.. నవరసాల్లో ఏ పాత్రయినా గొప్పగా పోషించే నటుడు. ఆయన మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. నేను దర్శకుడయ్యాక చాలా ఫంక్షన్స్‌లో ఆయన్ను కలిశాను. నాకు మంచి పాత్ర ఇస్తే.. ఓపిక లేకపోయినా సరే, కూర్చోనైనా నటిస్తా అన్నారు. కానీ, ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు. ఎంతోమంది ఆయన్ను అభిమానిస్తూనే ఉంటారు. ఆయన పాత్రలతో, నటనతో మన మధ్య ఎల్లప్పుడూ ఉంటారు అని చెప్పుకొచ్చాడు.
లేని లోటు పూడ్చలేనిది
ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. ప్రతిఘటన చిత్రంలో తన అద్భుత నటనతో యావత్ తెలుగు జాతిని ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిన మహా నటుడు కోట శ్రీనివాసరావు. కామెడీ, విలన్, సెంటిమెంట్.. నవరసాలను పండించి మెప్పించి ఒప్పించిన మహానటుడు. ఆయన శకం ముగిసింది. పాన్ ఇండియా అని చెప్పి చాలామంది వేరే భాషా నటులను టాలీవుడ్‌లో ప్రవేశపెడుతున్నారు. దానివల్ల తెలుగులో గొప్ప నటుల టాలెంట్ ఉపయోగించుకోలేకపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇక్కడివారి ప్రతిభను ఉపయోగించుకోవాలి అని గొంతెత్తి ప్రశ్నించిన తెలుగు భాషాభిమాని కోట శ్రీనివాసరావు. ఆయన లేని లోటు పూడ్చలేనిది అని భావోద్వేగానికి లోనయ్యాడు.
చదవండి: కోట జీవితాన్ని మలుపు తిప్పిన నటుడు.. ఆ హీరో కాళ్లపై పడి నమస్కరించి..