 
													Sirivennela Seetharama Sastry Health Bulletin Released: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం తాజాగా సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. సినీ గేయ రచయిత సిరివెన్నెల న్యూమోనియాతో బాధపడుతున్నారు.

ప్రస్తుతం ఐసీయూలో ఉన్న సిరివెన్నెల ఆరోగ్యాన్ని నిపుణులైన వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంది. ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాం అని కిమ్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కాగా అనారోగ్యం కారణంగా ఈనెల 24న సిరివెన్నెలను ఆయన కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
