Thalapathy 67 Update: గ్యాంగ్‌స్టర్‌గా విజయ్‌.. ఆమెతో ముచ్చటగా మూడోసారి?

Keerthy Suresh to pair up Vijay for the third time in Thalapthy 67 - Sakshi

సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇలాంటి సంఘటన తాజాగా కోలీవుడ్‌లో వినిపిస్తోంది. దళపతిగా విజన్‌ కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయారు. ఈయన చిత్రాలు జయాపజాయాలకు అతీతంగా ఆడేస్తుంటాయి. ఇప్పటికి 65 చిత్రాలు చేసిన విజయ్‌ ప్రస్తుతం 66వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను నేరుగా అలరించడానికి సిద్ధమవుతున్నారు.

వంశీ దర్శకత్వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇందులో నటి రష్మిక మందన్న నాయకిగా నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణదశలో ఉంది. అయితే విజయ్‌ తన తదుపరి చిత్రానికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టు సమాచారం. దీనికి లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. వరుస విజయాలతో జోరు మీద ఉన్న దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ ఇటీవల కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కించిన విక్రమ్‌ చిత్రం ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది.

అంతకుముందు విజయ్‌ కథానాయకుడుగా రూపొందించిన మాస్టర్‌ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో విజయ్, దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌లో కాంబో మళ్లీ రిపీట్‌ కాబోతోందని సమాచారం. ఇందులో నటుడు విజయ్‌ 50 ఏళ్ల గ్యాంగ్‌ స్టర్‌గా నటించినట్లు, ఆయనకు జంటగా నటి త్రిష ఎంపిక కాగా, మరో నాయకిగా సమంత ప్రచారం జరిగింది. అయితే తాజాగా సమంతకు బదులు నటి కీర్తి సురేష్‌ నటించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌.

కాగా విజయ్, కీర్తి సురేష్‌ కలిసి ఇప్పటికే సర్కార్, భైరవ చిత్రాల్లో నటించారు. తాజాగా ముచ్చటగా మూడోసారి ఈ జంట కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆరుగురు విలన్‌లు ఉంటారని, ఒక్కో భాష నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. అందులో బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సంజయ్‌ దత్, మలయాళ నటుడు పృథ్వీరాజ్, కన్నడ నటుడు అర్జున్‌ను విలన్‌ పాత్రలకు ఎంపిక చేసినట్లు, మరో ముగ్గురిని ఎంపిక చేయాల్సి ఉన్నట్లు సమాచారం.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top