
తేజ సజ్జా, మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రల్లో నటించిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ మిరాయ్... దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు పొందాడు. సుమారు పదేళ్లుగా సినీ రంగంలో ఉన్న ఆయన మిరాయ్‌తో భారీ హిట్ అందుకున్నారు. అయితే, తాజాగా మెగాస్టార్ చిరంజీవితో కార్తీక్ సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు. కానీ, దర్శకుడిగా కాదు.
వాల్తేరు వీరయ్య విజయం తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో మరో సినిమా రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించే అవకాశముంది. త్వరలోనే సెట్స్ మీదకు ఈ ప్రాజెక్ట్ వెళ్లనుంది. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా కార్తిక్ ఘట్టమనేని చేయబోతున్నారు. మెగాస్టార్‌తో తొలిసారి ఆయనకు ఛాన్స్ రావడంతో ఆయన సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్ను కోరి, ఎక్స్‌ప్రెస్ రాజా,ధమాకా, కార్తీకేయ, చిత్రలహరి వంటి సినిమాలకు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. తాజాగా విడుదలైన మిరాయ్ మూవీ సినిమాటోగ్రాఫర్ కూడా కార్తిక్ కావడం విశేషం. సినిమాటోగ్రాఫర్‌గా కార్తీక్‌కు మంచి గుర్తింపు ఉంది. దర్శకుడిగా పనిచేస్తూనే ఆయన తన కెమెరాకు కూడా పని చెప్తారు. డైరెక్టర్‌గా తొలిచిత్రం సూర్య వర్సెస్ సూర్య తర్వాత మిరాయ్‌తో భారీ హిట్ అందుకున్నారు.