
35 ఏళ్లు వచ్చినా ఇంకా సింగిల్‌గానే ఉంది బుల్లితెర నటి జాస్మిన్ భాసిన్ (Jasmin Bhasin). పెళ్లి సంగతేమో కానీ కూతురు కావాలంటోందీ ముద్దుగుమ్మ. తప్పకుండా ఓ పాపను దత్తత తీసుకుంటానని గతంలోనే చెప్పింది. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన జాస్మిన్.. మరోసారి ఆ విషయాన్ని ప్రస్తావించింది. అసలు పాపను దత్తత తీసుకోవాలన్న ఆలోచన ఎప్పుడొచ్చింది? అన్న అభిమాని ప్రశ్నకు ఇలా స్పందించింది.

అందుకే దత్తత ఆలోచన
నేను ఇల్లు వదిలి వచ్చేసినప్పుడు చాలా కష్టాలు అనుభవించాను. అప్పుడే అనుకున్నా.. నాకంటూ మంచి జీవితం సంపాదించుకున్నప్పుడు కచ్చితంగా మరొకరికి లైఫ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నా.. అందుకే ఓ పాపను దత్తత తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది. హిందీ బిగ్‌బాస్ 14వ సీజన్‌లో ఉన్నప్పుడు కూడా ఈ విషయం గురించి మాట్లాడుతూ.. నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పలేను.
అలాంటి పెళ్లయితే చేసుకోను
ఒకవేళ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టకపోయినా పర్వాలేదు. మంచి మనిషి దొరికితే పెళ్లి చేసుకుంటా.. లేదంటే ఏదో ఒకర్ని మ్యారేజ్ చేసుకుని తర్వాత విడిపోవాల్సి రావడం నాకైతే ఇష్టం లేదు. ఇకపోతే ఒక చిన్నారిని దత్తత తీసుకుని తనకు మంచి జీవితాన్ని ప్రసాదించాలనుకుంటున్నాను అని తెలిపింది. దిల్‌సే దిల్ తక్, నాగిన్ 4 వంటి సీరియల్స్‌తో జాస్మిన్‌కు పాపులారిటీ వచ్చింది. అర్ధ సర్బత్ దే భలే దీ, వార్నింగ్ 2, బద్నాం వంటి పంజాబీ చిత్రాల్లోనూ నటించింది. ద ట్రేటర్స్ అనే రియాలిటీ షోలోనూ పాల్గొంది.
చదవండి: థూ.. అదీ ఒక సినిమానేనా? నా కొడుకు మూవీ నాకే నచ్చలేదు