మూవీ: ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో
నటీనటులు: తిరువీర్, టీనా శ్రావ్య, నరేంద్ర రవి, యామిని నాగేశ్వర్, వాల్తేర్ విజయ్, ప్రభావతి, మాధవి, జోగారావు, బ్యాక్ భాషా తదితరులు
నిర్మాణ సంస్థ: 7పీఎం ప్రొడక్షన్, పప్పెట్ షో ప్రొడక్షన్
నిర్మాత: అగరం సందీప్
రచన, దర్శకత్వం: రాహుల్ శ్రీనివాస్
సంగీతం: సురేష్ బొబ్బిలి
సినిమాటోగ్రఫి: సోమశేఖర్
ఎడిటర్: నరేష్ అడుప
విడుదల తేది: నవంబర్ 7, 2025
కథేంటంటే..
విజయనగరం జిల్లాకు చెందిన రమేశ్(తీరువీర్) ఓ ఫోటోగ్రాఫర్. ఊర్లోనే ఓ ఫోటో స్టూడియో పెట్టుకొని పెళ్లిళ్లతో పాటు ఇతర కార్యక్రమాల ఫోటోలు తీస్తుంటాడు. అతని అసిస్టెంట్ రామ్(రోహన్ రాయ్)కి పనిమీద కంటే తిండిమీదే ధ్యాస ఎక్కువ. రామ్ చేసే చిన్న చిన్న తప్పులను పట్టించుకోకుండా..తన స్టూడియోకి ఎదురుగా ఉన్న పంజాయితీ ఆఫీస్‌లో పనిచేసే హేమ(టీనా శ్రావ్య)ను ప్రేమిస్తూ ఉంటాడు రమేశ్. హేమకు కూడా రమేశ్ అంటే ఇష్టమే కానీ..ఒకరికొకరు బయటకు చెప్పుకోకుండా చూపులతోనే ప్రేమించుకుంటూ జీవితాన్ని హాయిగా గడిపేస్తుంటారు.
కట్ చేస్తే.. ఓ రోజు అదే ప్రాంతానికి చెందిన ఆనంద్(నరేంద్ర రవి) రమేశ్ స్టూడియో దగ్గరకు వచ్చి.. జిల్లాలోనే ది బెస్ట్ ప్రీవెడ్డింగ్ షూట్ చేయాలని అడ్వాన్స్ ఇచ్చివెళ్లిపోతారు. ఔట్‌డోర్‌లో షూటింగ్ అంటే..తనకు కాబోయే భార్య సౌందర్య(యామిని)తీసుకొని జిల్లాకు వెళ్తాడు. దాదాపు లక్షన్నర వరకు ఖర్చు చేయించి..షూట్ కంప్లీట్ చేస్తాడు. ఆ షూట్ ఫుటేజ్ చిప్‌ని తన అసిస్టెంట్ రామ్ కి ఇచ్చి..స్టూడియోలో పెట్టమని చెప్తాడు. పనిపై ఎక్కువ శ్రద్ధ పెట్టని రామ్.. ఆ చిప్‌ని ఎక్కడో పారేస్తాడు. ఈ విషయం ఆనంద్‌కు తెలిస్తే..ఎక్కడ చంపేస్తాడో అనే భయంతో రమేశ్ కీలక నిర్ణయం తీసుకుంటాడు. అదేంటి? తన నిర్ణయం తప్పని తెలిసిన తర్వాత రమేశ్ ఏం చేశాడు? ఆనంద్, సౌందర్యల పెళ్లి ఆగిపోవడానికి గల కారణం ఏంటి? రమేశ్ తీసుకున్న నిర్ణయం ఆయనతో పాటు ఆనంద్ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించింది? ఈ సమస్య నుంచి బయటపడేందుకు రమేశ్‌కు హేమ ఎలాంటి సహాయం చేసింది? చివరకు ఆనంద్, సౌందర్యల పెళ్లి జరిగిందా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు పెద్ద కథ అవరసరం లేదు. సింపుల్ స్టోరీ అయినా సరే.. చెప్పాలనుకునే పాయింట్‌ని సిన్సియర్‌గా తెరపై చూపిస్తే చాలు.. ఆ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారు. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సినిమా కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ చాలా సింపుల్ కథను ఎంచుకొని.. కమర్షియల్ ఎలిమెంట్స్, ఎలివేషన్స్ జోలికి పోకుండా.. లీనియర్ స్క్రీన్ ప్లేతో ఎక్కడ బోర్ కొట్టించకుండా కథనాన్ని నడిపించాడు.
నటీనటుల ఎంపిక విషయంలోనూ ఆయన సక్సెస్ అయ్యాడు. స్టార్స్‌ని కాకుండా కంటెంట్‌ని నమ్ముకొని ఈ సినిమాను తెరకెక్కించాడు. ఒక్క సంఘటన మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుంది? సందర్భాన్ని బట్టి మనిషి స్వభావం ఎలా మారుతుందనే విషయాన్ని కామెడీ వేలో చక్కగా చూపించారు. ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు వినోదాత్మకంగానే సాగుతుంది. ఎమోషనల్ సన్నివేశాలు తక్కువే ఉన్నప్పటికీ.. అవి అలా గుర్తిండిపోతాయి.
ఫస్టాఫ్ మొత్తం వినోదాత్మకంగా సాగుతుంది. ఆనంద్, సౌందర్యల ప్రీ వెడ్డింగ్ షూట్.. చిప్ పోవడం.. ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు హీరో చేసే ప్రయత్నాలు...ఇవన్నీ నవ్వులు పూయిస్తాయి. పెళ్లి చెడగొట్టేందుకు హీరో చేసే ప్రయత్నాలు..కొంతవరకు సాగదీతగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో కథనాన్ని పరుగులు పెట్టించాడు. కామెడీతో పాటు ఎమోషనల్ సీన్లను కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఆనంద్, సౌందర్యలు విడిపోవడానికి గల కారణం నవ్విస్తూనే..ఆలోచింపజేస్తూంది. ఆటో సీన్‌తో అందరిని ఆకట్టుకుంటుంది.
క్లైమాక్స్‌లో హీరో చెప్పే డైలాగ్స్ భావోద్వేగానికి గురి చేస్తాయి. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. అవేవి పట్టించుకోకుండా చూస్తే.. అందరికీ నచ్చేస్తుంది. కామెడీ పేరుతో వల్గారిటీని చూపిస్తున్న ఈ రోజుల్లో.. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు. ఈ విషయంలో ఆయనను అభినందించాల్సిందే.
ఎవరెలా చేశారంటే..
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథలను ఎంచుకోవడంలో తీరువీర్ దిట్ట. ఈ సారి కూడా అలాంటి కథతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫోటోగ్రాఫర్ రమేశ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తెరపై అమాయకత్వంగా కనిపిస్తూనే..హీరోయిజాన్ని పండించాడు. ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర నరేంద్ర రవిది. పెళ్లికొడుకు ఆనంద్ పాత్రలో ఆయన జీవించేశాడు. నవ్విస్తూనే కొన్ని చోట్ల భావోధ్వేగానికి గురి చేస్తాడు. హేమా పాత్రకు టీనా శ్రావ‍్య న్యాయం చేసింది.
చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ మరోసారి తనదైన నటనతో నవ్వులు పూయించాడు. యామిని నాగేశ్వర్, వాల్తేర్ విజయ్, ప్రభావతి, మాధవి, జోగారావుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక నిపుణులకొస్తే సురేశ్ బొబ్బిలి సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన నేపథ్య సంగీతంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. సోమశేఖర్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.


