వివాదంలో రణ్‌వీర్‌ సింగ్‌ | FWICE issues non-cooperation directive against Ranveer Singh | Sakshi
Sakshi News home page

వివాదంలో రణ్‌వీర్‌ సింగ్‌

May 26 2026 12:05 AM | Updated on May 26 2026 12:05 AM

FWICE issues non-cooperation directive against Ranveer Singh

ఎఫ్‌డబ్ల్యూఐసీఈ నాన్‌–కోపరేషన్‌ ఆదేశం

రణ్‌వీర్‌ సింగ్‌ వివాదంలో చిక్కుకున్నారు. దానికి కారణం ‘డాన్‌ 3’ సినిమా. ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా 2023లో ‘డాన్‌ 3’ సినిమా ప్రకటన వచ్చింది. రితేష్‌ సిధ్వాని, ఫర్హాన్‌ అక్తర్‌ ఈ చిత్రానికి నిర్మాతలు. ఇప్పటివరకూ ఈ సినిమా సెట్స్‌కు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రణ్‌వీర్‌ సింగ్‌ సడన్‌గా తప్పుకోవడం వివాదమైంది. దీంతో దాదాపు రూ. 45 కోట్ల నష్టం వాటిల్లిందని ఫర్హాన్‌ అక్తర్‌ ఆరోపించి, ‘ది ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎం΄్లాయిస్‌’ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ)కి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎఫ్‌డబ్ల్యూఐసీఈ చీఫ్‌ అడ్వైజర్‌ అశోక్‌ పండిట్‌ మాట్లాడుతూ– ‘‘రణ్‌వీర్‌ సింగ్‌ వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలని ఏప్రిల్‌ 10న ఫర్హాన్‌ అక్తర్‌ ఫిర్యాదు చేశారు.

మరో మూడు వారాల్లో ‘డాన్‌ 3’ప్రారంభమవ్వాల్సిన సమయంలో రణ్‌వీర్‌ ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. దాదాపు 200మంది వర్కర్స్‌కు హోటల్‌ బుకింగ్స్, ట్రావెల్‌ ప్లాన్, లొకేషన్‌ బుకింగ్‌ వంటివాటికి ఫర్హాన్, రితేష్‌ ఖర్చు చేశారు. అలాగే ఫర్హాన్‌ నిర్మాణ సంస్థ అయిన ఎక్సెల్‌ ఎంటర్టైన్మెంట్‌తో మూడు సినిమాలు చేసేందుకు రణ్‌వీర్‌ కాంట్రాక్ట్‌ చేసుకున్నారు. స్క్రిప్ట్‌ వర్క్‌ ఆయన సమక్షంలోనే జరిగింది. రణ్‌వీర్‌ సింగ్‌ను తన తరఫు వాదనలు వినిపించాలని మూడు నోటీసులు పంపాం. కానీ స్పందన లేదు’’ అని తెలిపారు. ‘‘ఎంతటి సూపర్‌ స్టార్‌ హీరో అయినా చట్టం ముందు గొప్ప కాదని మేం ఇండస్ట్రీకి చెప్పాలనుకుంటున్నాం. రణ్‌వీర్‌ సింగ్‌ వచ్చి, మమ్మల్ని కలిసేంత వరకు ఆయనపై సహాయ నిరాకరణ కొనసాగుతుంది’’ అని ఎఫ్‌డబ్ల్యూఐసీఈ అధ్యక్షుడు బీఎన్‌ తివారి తెలిపారు. 

హుందాగా పరిష్కరించుకోవాలి: రణ్‌వీర్‌
ఈ నేపథ్యంలో ‘‘ఈ తరహా విషయాలను పరిణతితో, పరస్పర గౌరవంతో పరిష్కరించుకుంటే బాగుంటుంది. ‘డాన్‌’ ఫ్రాంచైజీతో సంబంధం ఉన్నవారితో సహా, చిత్ర పరిశ్రమలోని అందరి పట్ల మా నటుడికి అత్యంత గౌరవం ఉంది’’ అంటూ రణ్‌వీర్‌ సింగ్‌ తరపున ఆయన అధికార ప్రతినిధి ఓ లేఖ విడుదల చేశారు. అందులోని సారాంశం ఈ విధంగా... ‘‘డాన్‌ 3’కి సంబంధించి ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనల దృష్ట్యా ఆయన (రణ్‌వీర్‌) మౌనంగా ఉండాలనుకున్నారు. వృత్తికి సంబంధించిన చర్చలు, వ్యక్తిగత అనుబంధాలకు సంబంధించిన విషయాలను హుందాగా, పరిణతితో పరిష్కరించుకోవాలి.

అయితే ఈ మధ్య పలు ఊహాగానాలు నెలకొనడంతో రణ్‌వీర్‌ స్పందించాలనుకున్నారు. ఆయన ఫోకస్‌ మొత్తం ప్రస్తుత కమిట్‌మెంట్స్, చేసే పని మీద మాత్రమే ఉన్నాయి’’ అన్నది ఆ లేఖ సారాంశం. అలాగే ‘‘ఈ చిత్రంతో అసోసియేట్‌ అయిన అందరి మీదా ప్రగాఢమైన గౌరవం, సానుకూలత ఉన్నాయి. ఈ ‘డాన్‌’ ఫ్రాంచైజీ తన విజయాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను’’ అని కూడా రణ్‌వీర్‌ పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement