
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.
2026 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే కొన్నిపాటలను సిద్ధం చేశారట భీమ్స్. ప్రమోషన్లలో భాగంగా దసరా సందర్భంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ నుంచి తొలిపాటను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
వినాయక చవితి పండగని పురస్కరించుకుని ప్రత్యేకపోస్టర్‌ని విడుదల చేసిన యూనిట్.. ఇప్పుడు దసరాకి తొలిపాట రిలీజ్ చేసి, సినిమాపై మరింత క్రేజ్ పెంచాలన్నది ఆలోచనట. మరి... దసరా పండగకిపాట విడుదల చేస్తారా? లేదా? లేకుంటే మరేదైనా అప్‌డేట్ ఉంటుందా? అన్నది వేచి చూడాలి. ఇదిలా ఉంటే.. చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వం వహించిన ‘విశ్వంభర’ సినిమా 2026 వేసవిలో రిలీజ్ కానుంది.