
ఇటీవల బాలీవుడ్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తమ వ్యక్తిగత హక్కుల కోసం ఢిల్లీ హైకోర్ట్ను ఆశ్రయించారు. తమ అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు వినియోగించకుండా అడ్డుకోవాలని పిటిషన్ వేశారు. కొందరు ఎలాంటి అనుమతులు లేకుండా దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఐశ్వర్య, అభిషేక్ తమ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
తాజాగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సైతం ఇదే విషయంలో ఢిల్లీ హైకోర్ట్ను ఆశ్రయించారు. తన పేరుతో నిధులను సేకరించి దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పిటిషన్ వేశారు. ఈ మేరకు కరణ్ తరఫున సీనియర్ న్యాయవాది రాజశేఖర్ రావు వాదనలు వినిపించారు. ఎలాంటి అనుమతి లేకుండా తన ఫోటోలు వినియోగిస్తున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. అంతేకాకుండా సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో కరణ్ పేరుతో అనధికార పేజీలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. దీనిపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.