Divyansha Kaushik: ఆ గ్యాప్‌లో నన్ను నేను తెలుసుకున్నాను

Divyansha Kaushik Talks About Ramarao On Duty Movie - Sakshi

రవితేజ, దివ్యాంశా కౌశిక్, రజీషా విజయన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రామారావు: ఆన్‌ డ్యూటీ’. శరత్‌ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, రవితేజ టీమ్‌ వర్క్స్‌ పతాకాలపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో దివ్యాంశా కౌశిక్‌ చెప్పిన విశేషాలు. 

► ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ చిత్రం 1995లో జరిగే కథ. ఈ చిత్రంలో నందిని అనే గృహిణి పాత్ర చేశాను. రామారావు (రవితేజ పాత్ర పేరు..)కు భార్యగా, అతనికి మోరల్‌ సపోర్ట్‌గా ఉంటాను. నటనకు ఎక్కువ స్కోప్‌ ఉన్న పాత్ర ఇది. షూటింగ్‌ ముందు కొన్ని వర్క్‌షాప్స్‌ చేశాను. నందిని పాత్రను చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశాను.  

► శరత్‌గారు మంచి విజన్‌ ఉన్న దర్శకుడు. రజీషాతో నాకు కొన్ని కాంబినేషన్స్‌ సీన్స్‌ ఉన్నాయి. సినిమాలో రామారావు ఎక్స్‌ లవర్‌ మాలిని పాత్రలో ఆమె కనిపిస్తారు. రామారావు పెళ్లి మాలినితో కాకుండా నందినితో ఎందుకు జరిగింది? అనే విషయాన్ని మాత్రం సినిమాలోనే చూడాలి.  

► తెలుగులో నా తొలి చిత్రం ‘మజిలీ’ తర్వాత  కోవిడ్‌ వల్ల నాకు కొంత గ్యాప్‌ వచ్చింది. ఈ గ్యాప్‌లో నేను కొన్ని డ్యాన్స్, యాక్టింగ్‌ క్లాసులు, తెలుగు క్లాసులు తీసుకున్నాను. నన్ను నేను తెలుసుకుని, మెరుగయ్యే ప్రయత్నం చేశాను. ఓ యాక్టర్‌గా నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. ‘మజిలీ’లో నేను చేసిన అన్షు పాత్రకు, ‘రామారావు ఆన్‌ డ్యూటీ’లో చేసిన నందిని పాత్రకు చాలా తేడా ఉంది.

► ‘మజిలీ’ చిత్రంలో నాగచైతన్యతో, ‘రామరావు ఆన్‌ డ్యూటీ’లో రవితేజగారితో వర్క్‌ చేయడం డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌. సెట్స్‌లో రవితేజగారు యాక్టివ్‌గా ఉంటే, నాగచైతన్య కామ్‌ అండ్‌ కూల్‌గా ఉంటారు. అయితే ఇద్దరిలో ఒక కామన్ క్యాలిటీ  ఉంది. సెట్స్ లో సరదా  ఫ్రాంక్స్ చేస్తుంటారు( నవ్వూతూ..)

► తెలుగులో మహేశ్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌.. ఇలా  అందరి హీరోలతో సినిమాలు చేయాలని ఉంది (నవ్వుతూ..).


► నందిని పాత్రకు నేను డబ్బింగ్‌ చెప్పలేదు కానీ నా తర్వాతి చిత్రం ‘మైఖేల్‌’కు తెలుగులోనే డబ్బింగ్‌ చెబుతాను. అలాగే సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా ఒప్పుకున్నాను. స్క్రిప్ట్‌ నచ్చితే వెబ్‌ సిరీస్‌లో యాక్ట్‌ చేస్తాను. ఏదైనా బయోపిక్‌లో యాక్ట్‌ చేయాలని ఉంది. ఎవరి బయోపిక్‌ అనేది నన్ను ఎంచుకునే దర్శకుల ఆలోచనపై ఆధారపడి ఉంటుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top