12 ఏళ్లకే ప్రేమలో పడిన సైరా.. 22 ఏళ్ల తేడా.. 54 ఏళ్ల కాపురం!

Dilip Kumar And Saira Banu Love Story In Telugu - Sakshi

Dilip Kumar Saira Banu Love Story(సాక్షి, వెబ్‌డెస్క్‌): వయసులో ఇరవై రెండేళ్ల వ్యత్యాసం.. అయితేనేం అన్యోన్య దాంపత్యం వారిది. తరతరాలకు స్ఫూర్తినిచ్చే అద్భుతమైన ప్రేమ కథకు ఆ జంట ప్రాణం పోసింది. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా 54 ఏళ్ల పాటు కలిసే జీవన ప్రయాణాన్ని కొనసాగించింది. చిన్న చిన్న అపార్థాలకే విడాకులు తీసుకుంటారనే అపవాదు ఉన్న సినీ ఇండస్ట్రీలోనే వారూ ఉన్నారు. కానీ అభిప్రాయ భేదాలు తలెత్తినా సర్దుకుపోయారే తప్ప ఒకరి చేయి ఒకరు వీడలేదు.

ఆయన మరొకరిని పెళ్లాడినా.. ఆమె అర్థం చేసుకున్నారే తప్ప అడ్డుచెప్పలేదు. ఆమె సహనం వహించింది. ఆయన తప్పు తెలుసుకున్నాడు. పొరపొచ్చాలు తొలగిపోయాయి. ఎప్పటిలాగే వారి అనుబంధం కొనసాగింది. కానీ ఇప్పుడు మృత్యువు వారిని విడదీసింది. బాలీవుడ్‌ ట్రాజెడీ కింగ్‌గా పేరొందిన దిగ్గజ నటుడు దిలీప్‌ కుమార్‌ శాశ్వతంగా లోకాన్ని వీడి వెళ్లారు. లక్షలాది మంది అభిమానులతో పాటు భార్య సైరా బానుకు తీరని దుఃఖం మిగిల్చారు. 

పన్నెండేళ్ల వయసులోనే దిలీప్‌తో ప్రేమలో పడ్డ సైరా!
అప్పటికే దిలీప్‌ కుమార్‌ బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదిగారు. 1944లో జ్వర్‌ భాతా సినిమాతో సిల్వర్‌ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన ఆయన.. 1955 నాటికి ఆజాద్‌, దేవదాస్‌ సినిమాలతో బిగ్గెస్ట్‌ హిట్లతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. వారిలో సైరా బాను కూడా ఒకరు. ఆయనంటే ఆరాధన ఆమెకు. 'మొఘల్‌-ఎ-ఆజామ్‌' సినిమా సమయంలో దిలీప్‌ను కలవాలని ఎంతగానో ఆరాటపడ్డారు సైరా.

కానీ కనీసం ఆమె వైపు చూడను కూడా చూడలేదాయన. ఆమె చిన్నబుచ్చుకుంది. అయితే, కొన్నాళ్ల తర్వాత ఆమె కోరిక నెరవేరింది. ఎట్టకేలకు ఆయనను కలిసే భాగ్యం లభించింది. సైరాను చూసి చిరునవ్వు చిందించాడు దిలీప్‌. గాల్లో తేలిపోయిందామె. మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఏదో ఒకరోజు దిలీప్‌ను పెళ్లి చేసుకుని భార్యను కావడం తథ్యం అని ఆనాడే బలంగా నమ్మింది. 

దిలీప్‌ పెద్దగా ఇంట్రస్ట్‌ చూపలేదు.. కానీ
తన తల్లి, నటి నసీం బాను వారసత్వంతో బీ-టౌన్‌లో అడుగుపెట్టింది సైరా. ఎంతో మందికి జోడీగా నటించింది. అవేమీ ఆమె మనసుకు తృప్తినివ్వలేదు. ఎలాగైనా దిలీప్‌తో జోడీ కట్టాలి.. ఆయనకు జంటగా కనిపించాలి అని తహతహలాడేది. కానీ, దిలీప్‌ కుమార్‌ మాత్రం పెద్దగా ఆసక్తి కనబరచలేదు. తన పక్కన సైరా మరీ చిన్నదానిలా కనిపిస్తుందని ఆయన భావన. అయినా ఎన్నాళ్లని తప్పించుకుంటారు.. సైరా అందం, ఆకర్షణీయ రూపానికి ఎలా ఫిదా కాకుండా ఉంటారు. 

అలాంటి ఒకరోజు రానే వచ్చింది. ఆనాడు కారులో వెళ్తున్న సమయంలో.. ఓ పూదోటలో సైరాను చూశాడు దిలీప్‌ కుమార్‌. చీరకట్టులో నిండైన రూపంతో నిల్చుని ఉన్న ఆమెను చూసి, ‘‘ఇన్నాళ్లు నేను కాదనుకుంటోంది ఈ అందాల రాశినా! తను చిన్నపిల్ల కాదు. పరిపూర్ణ మహిళ. తనతో కలిసి నటించాల్సిందే’’ అనుకున్నాడు ఆయన. వెంటనే కారు దిగి, సైరాతో కరచాలనం చేశాడు. ఆనాటి నుంచి 54 ఏళ్ల వరకు ఆమె చేతిని వీడలేదు.

కలిసి నటించారు.. అనుబంధాన్ని పెనవేసుకున్నారు
సగీనా మహతో, చోటీ బహూ, దునియా వంటి చిత్రాల్లో జంటగా నటించారు దిలీప్‌- సైరా బాను. ఆ సమయంలో వారి మధ్య పరిచయం, గాఢమైన స్నేహంగా మారింది. కూతురి మనసు తెలుసుకున్న సైరా తల్లి నసీం బాను.. వీరిద్దరిని మరింత చేరువ చేసింది. వారి అనుబంధానికి వారధిగా నిలిచింది. ఈ క్రమంలో.. ఓ శుభ ముహూర్తాన దిలీప్‌.. సైరా ముందు తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది సైరా. అతడి ప్రేమను మనస్ఫూర్తిగా ఆమె అంగీకరించింది. 

22 ఏళ్ల వ్యత్యాసం.. ఎప్పటికీ తల్లి కాలేరు
1966లో ఇద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. అప్పటికి సైరాకు 22 ఏళ్లు. దిలీప్‌ కుమార్‌ వయస్సు 44. ఇద్దరి మధ్యా 22 ఏళ్ల వ్యత్యాసంపై ఎన్నో విమర్శలు వినిపించాయి. వీరి బంధం మూణ్ణాళ్ల ముచ్చటే అనే పెదవి విరుపులు. కానీ, అది తప్పని నిరూపించారు ఇద్దరూ. 

ఇక పెళ్లి తర్వాత కూడా సైరా కొన్నాళ్ల పాటు సినిమాల్లో నటించారు. పెద్ద హీరోలతో కలిసి పనిచేశారు కూడా. ఇటు కెరీర్‌, అటు వైవాహిక జీవితం సాగిపోతోందనుకుంటున్న సంతోష సమయంలో ఓ పెద్ద కుదుపు. 1972లో గర్భవతి అయ్యారు సైరా. ఇద్దరూ ఆనందంలో తేలిపోయారు. చిన్నారి రాకకోసం వేయి కళ్లతో ఎదురుచూశారు. కానీ, విధిరాత మరోలా ఉంది. ఎనిమిదో నెలలో సైరాకు గర్భస్రావం అయ్యింది. ఈ క్రమంలో తలెత్తిన అనారోగ్య సమస్యల వలన ఆమె ఎప్పటికీ తల్లికాలేరని నిర్ధారించారు వైద్యులు. 

పలువురితో సంబంధాలు.. రెండో వివాహం
ఎప్పుడైతే సైరా ఇక గర్భవతి కాలేరన్న నిజం ప్రపంచానికి తెలిసిందో.. అప్పటి నుంచి పలువురు బాలీవుడ్‌ నటీమణులతో కలిపి దిలీప్‌ కుమార్‌ పేరు వినిపించేది. ఆయన మరో పెళ్లికి సిద్ధమయ్యారనేది ఆ వార్తల సారాంశం. వీటన్నిటిని చూసి, సైరాకు దుఃఖం పొంగుకొచ్చేది. దిలీప్‌ ఎప్పటికీ తన చేయి వీడడని మనసు ఎంతగా చెబుతున్నా.. ఎక్కడో ఏదో అనుమానం. ఊహించిందే నిజమైంది. ఆస్మా రెహమాన్‌ వారి జీవితాల్లో ప్రవేశించింది.

పెద్ద తప్పు చేశాను.. దిలీప్‌ పశ్చాత్తాపం
హైదరాబాద్‌లో ఓ క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన సమయంలో ఆస్మాను కలిశాడు దిలీప్‌. ఆయన సోదరీమణులు ఫౌజియా, సయీదాలకు స్నేహితురాలు ఆమె. వారే తనను దిలీప్‌నకు పరిచయం చేశారు. అప్పటికే ఆస్మా.. ముగ్గురు పిల్లల తల్లి. అయినా ఎందుకో దిలీప్‌ కుమార్‌ ఆమె వైపు ఆకర్షితుడయ్యాడు. ఆస్మాను పెళ్లాడాడు. కానీ, ఆ బంధం రెండేళ్లకే ముగిసిపోయింది. ఆస్మాకు విడాకులు ఇచ్చి మళ్లీ సైరా చెంతకే చేరాడు దిలీప్‌ కుమార్‌. జీవితంలో తను రెండో పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశానని, కొన్ని అనివార్య కారణాలు, ఒత్తిడి వల్లే అలా చేయాల్సి వచ్చిందని, ఆ చేదు జ్ఞాపకాలను మరిచిపోవాలనుకుంటున్నానని దిలీప్‌ తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నారు.

నాకు ఆయనే సర్వస్వం.. అందుకే
నిజానికి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తనను కాదని వేరే మహిళను జీవితంలో ఆహ్వానిస్తే ఏ భార్య మళ్లీ ఆ భర్తను క్షమించదు. కానీ, సైరా బాను ప్రేమ అనిర్వచనీయం, అనంతమైనది కదా. అందుకే ఆమె మళ్లీ మనస్ఫూర్తిగా దిలీప్‌ కుమార్‌ను భర్తగా అంగీకరించింది. ‘‘నాకు ఎల్లప్పుడూ ఆయనే సర్వస్వం. నా జీవితంలో ఆయన ఒక్కరే. ఒక అభిమానిగా, భార్యగా ఆయనను ఆరాధించాను. నాకు తెలుసు ఎంతో మంది అందమైన అమ్మాయిలు ఆయనను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నారు.

కానీ.. ఆయన నన్ను తన జీవితభాగస్వామిగా ఎంచుకున్నారు. నా కలలన్నీ నిజం చేశారు. ఆయనను ఎలా వదులుకోగలను’’ అంటూ ఒకానొక సందర్భంలో భర్తపై తనకున్న అవ్యాజమైన ప్రేమను చాటుకున్నారు సైరా. దిలీప్‌ సైతం.. ‘‘నువ్వు ఆ చందమామ కూతురువి. నాకోసం స్వర్గం నుంచి దిగివచ్చావు’’ అంటూ వీలు కుదిరినప్పుడల్లా ఆమెపై ప్రేమ కురిపించేవారు. కానీ, ఇప్పుడు ఆమెను ఇక్కడ వదిలి ఆయనే స్వర్గలోకాలకు వెళ్లిపోయారు. తన ప్రియసఖిని విషాదంలో ముంచివేశారు!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top