Dil raju: తెలుగు సినిమా ఎలా ఉండాలన్నదానిపై వర్క్‌ చేస్తున్నాం

Dil Raju Comments After Telugu Film Chamber Of Commerce Meeting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సినిమా ఎన్ని వారాల తర్వాత ఓటీటీకి వెళ్తే బాగుంటుంది? థియేటర్స్‌లో వీపీఎఫ్‌ చార్జీలు ఎంత ఉండాలి? ఇలా పలు అంశాలపై తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కమిటీ గురువారం భేటీ అయింది. ఈ సందర్భంగా అనేక అంశాలను వారు చర్చించినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ.. 'నిర్మాతలమందరం కలిసి షూటింగ్స్‌ ఆపాం. మేము ప్రస్తుతం నాలుగు అంశాలపై చర్చిస్తున్నాం.

సినిమాలు ఓటీటీకి ఎన్ని వారాలకు వెళితే ఇండస్ట్రీకి మంచిది అన్న విషయంలో ఓ కమిటీ వేసుకున్నాము. ఆ కమిటీ ఓటీటీకి సంబంధించినదానిపై పని చేస్తోంది. రెండోది.. థియేటర్స్‌లో వీపీఎఫ్‌ చార్జీలు, పర్సెంటేజ్‌లు ఎలా ఉండాలన్నదానిపై కమిటీ వేశాం. ఆ కమిటీ ఎగ్జిబిటర్స్‌తో మాట్లాడుతుంది. మూడోది.. ఫెడరేషన్‌ వేజెస్‌, వర్కింగ్‌ కండీషన్స్‌పై కూడా కమిటీ వేశాము. నాలుగు.. నిర్మాతలకు ప్రొడక్షన్‌లో వేస్టేజ్‌ తగ్గింపు, వర్కింగ్‌ కండీషన్స్‌, షూటింగ్‌ నంబర్‌ ఆఫ్‌ అవర్స్‌ జరగాలంటే ఏం చెయ్యాలన్నదానిపై కూడా కమిటీ వేశాం.

ఫిలిం చాంబర్‌ ఆధ్వర్యంలో ఈ నాలుగు అంశాల మీద నాలుగు కమిటీలు వేశాం. ప్రస్తుతం అవి పని చేస్తున్నాయి. కానీ కొందరు సోషల్‌ మీడియాలో ఏవేవో రాస్తున్నారు. మా అందరికీ నెలల తరబడి షూటింగ్స్‌ ఆపాలన్న ఉద్దేశ్యం లేదు. నిర్మాతకు ఏదీ భారం కాకూడదు. గత మూడు రోజుల నుంచి మూడు, నాలుగు మీటింగ్స్‌ అయ్యాయి. నాలుగు కమిటీలు చాలా హోంవర్క్‌ చేస్తున్నాయి. తెలుగు సినిమా ఎలా ఉండాలనేది వర్క్‌ చేస్తున్నాం, త్వరలో ఆ రిజల్ట్‌ వస్తుంది' అని దిల్‌ రాజు పేర్కొన్నాడు.

చదవండి: బరువు తగ్గిన ప్రభాస్‌.. ట్రిమ్‌డ్ గడ్డంతో స్టైలీష్‌గా ‘డార్లింగ్‌’.. పిక్స్‌ వైరల్‌
 ఓటీటీలోకి సాయి పల్లవి ‘గార్గి’, ఎప్పుడు?.. ఎక్కడ?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top