
మలయాళ నటుడు దేవన్ (Devan Sreenivasan ) భార్యను కోల్పోయి ఆరేళ్లపైనే అవుతోంది. దేవా సతీమణి సుమ 2019లో అలర్జీతో మరణించింది. తాజాగా భార్యను గుర్తు చేసుకున్న నటుడు ఆమె మరణానికి గల కారణాన్ని వెల్లడించాడు. దేవన్ మాట్లాడుతూ.. తను బాగానే ఉండేది. ఏమైందో ఏమో కానీ ఐస్‌క్రీమ్ తింటే మాత్రం పడేది కాదు. అదెలా తెలిసిందంటే.. చెన్నైలో ఉన్నప్పుడు ఓసారి ఐస్‌క్రీమ్ తిన్నాం. కాసేపటికే తనకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది.
డాక్టర్ వార్నింగ్
వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో పెద్ద ప్రమాదం తప్పింది. తను ఎప్పటికీ ఐస్‌క్రీమ్ తినకూడదని డాక్టర్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. మేము కూడా దాన్ని ఫాలో అయ్యాం. ఒకరోజు నా కూతురు లక్ష్మి దాని బిడ్డను తీసుకుని మా ఇంటికి వచ్చింది. అప్పుడు నేను ఇంట్లో లేను. షూటింగ్ కోసం వేరే లొకేషన్‌లో ఉన్నాను. పిల్లల కోసమని ఐస్‌క్రీమ్ కొన్న ఆమె కాస్త మిగిలితే దాన్నలాగే వదిలేసి తిరిగెళ్లిపోయింది. ఇంట్లో ఉన్న సుమ.. డాక్టర్ వార్నింగ్ మర్చిపోయి కాస్తం ఐస్ క్రీమ్ తింది. అంతే.. మళ్లీ తనకు ఊపిరి తీసుకోవడం కష్టమైంది.
వెళ్లేసరికే..
నేలపై పడి గిలగిల కొట్టుకుంటోందని పనివాళ్లు ఫోన్ చేసి చెప్పారు. నేను ఇంటికెళ్లేసరికి తన పరిస్థితి మరింత దిగజారింది. హాస్పిటల్‌కు తీసుకెళ్లాం, కానీ తనను కాపాడుకోలేకపోయాం. ఐస్‌క్రీమ్ అలర్జీ వల్ల ఊపిరితిత్తుల్లో రంధ్రాలు ఏర్పడ్డాయి. అలా నా భార్య కన్నుమూసింది అని చెప్పుకొచ్చాడు. దక్షిణాదిన వందలాది చిత్రాల్లో నటించిన దేవన్ తెలుగులో ఆశయం, పెళ్లి చేసుకుందాం, మా అన్నయ్య, దేశముదురు, ఏమాయ చేసావె, హార్ట్ ఎటాక్, సాహొ వంటి పలు చిత్రాల్లో నటించాడు. ఎక్కువగా విలన్ పాత్రలతోనే మెప్పించాడు.
చదవండి: 'లోక' @ రూ.200 కోట్లు.. గర్వాన్ని తలకెక్కించుకోవద్దన్న తండ్రి