‘డెకాయిట్’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Dacoit Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Dacoit Review: ‘డెకాయిట్’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Apr 10 2026 7:59 AM | Updated on Apr 10 2026 8:48 AM

Dacoit Movie Review And Rating In Telugu

టైటిల్‌: డెకాయిట్‌ 
నటీనటులు: అడివి శేష్‌,మృణాల్‌ ఠాకూర్‌, అనురాగ్‌ కశ్యప్‌, ప్రకాశ్‌ రాజ్‌, కామాక్షి భాస్కర్ల తదితరులు
నిర్మాత: సుప్రియ యార్లగడ్డ, సునీల్‌ నారంగ్‌
కథ, స్క్రీన్‌ప్లే: అడివి శేష్‌ 
దర్శకత్వం: షానియల్‌ డియో
సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: ధనుష్‌ భాస్కర్‌
విడుదల తేది: ఏప్రిల్‌ 10, 2026

అడివి శేష్ హీరోగా షానిల్ డియో తెరకెక్కించిన చిత్రం ‘డెకాయిట్’. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ మూవీని ఏప్రిల్ 10న రిలీజ్ చేశారు. టీజర్, ట్రైలర్‌తో అంచనాలు పెంచేసిన ఈ టీం మరి ఆడియెన్స్‌ని మెప్పించిందా? లేదా? అన్నది చూద్దాం.

కథేంటంటే..
తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడివి శేష్)ని అగ్ర కులానికి చెందిన సరస్వతి అలియాస్ జూలియట్ (మృణాళ్ ఠాకూర్) ప్రేమిస్తుంది. అయితే ఈ కులం కారణంగా ఇద్దరూ విడిపోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే హరిని ఓ కేసులో అబద్దపు సాక్ష్యం చెప్పి జైలుకు పంపిస్తుంది సరస్వతి. పదమూడేళ్లు జైల్లో గడిపిన తరువాత హరి అక్కడి నుంచి పారిపోయి బయటకు వస్తాడు. తనను తప్పుడు సాక్ష్యంతో జైలుకు పంపించిన సరస్వతి మీద పగ తీర్చుకోవాలని హరి అనుకుంటాడు. కానీ అప్పటికే సరస్వతి కుటుంబ కష్టాలతో సతమతం అవుతుంది. అటు సరస్వతికి, ఇటు హరికి ఇద్దరికీ డబ్బు సమస్య వస్తుంది. ఇక ఆ డబ్బు కోసం ఈ ఇద్దరూ కలిసి ఏం చేశారు? ఆ తరువాత ఏం జరిగింది? అసలు హరిని సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? చివరకు తన జూలియట్ కోసం హరి ఏం చేస్తాడు? అన్నదే కథ.

ఎలా తీశారంటే?..
ప్రేమ కథలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రేమ కథల్ని ఎంత కొత్తగా, ఎంత అట్రాక్టివ్‌గా చెప్పామన్నదే విజయంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఆ విషయంలో డెకాయిట్ కొంత వరకు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రేమకు కులం అడ్డు అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇందులోనే అదే పాయింట్‌ను చూపించారు. కానీ ఇందులోని ప్రేమ కథను, ప్రేమికుల్ని కాస్త కొత్తగా, భిన్న శైలిలో చూపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రేయసి మీద పగ తీర్చుకోవాలని అనుకుంటాడు హీరో. ఇద్దరూ కలిసి దొంగ తనాలు కూడా చేస్తుంటారు. ఇంటర్వెల్‌కు ఓ చిన్న పాటి ట్విస్ట్‌లాంటిది ఇస్తారు.

ఇక సెకండాఫ్‌లో హీరోకి అసలు విషయం తెలియడం, గతానికి సంబంధించిన నిజం, తన కోసం ప్రేయసి చేసిన త్యాగం ఇవన్నీ తెలుస్తాయి. ఇక ప్రేయసికి ఉన్న ఇబ్బందిని తీర్చేందుకు ప్రియుడు చేసే త్యాగంతో క్లైమాక్స్ కాస్త బరువెక్కినట్టుగా అనిపిస్తుంది. అయితే ఆ ట్విస్ట్ కూడా ఆడియెన్స్ ముందే పసిగట్టేస్తారు. కాబట్టి చివరకు అదేదో పెద్ద ట్విస్ట్, త్యాగంలా అనిపించదు. పైగా ఇది వరకు సినిమాల్లో చూసేసి ఉండటంతో ఇక్కడ ఆ ట్విస్ట్‌ అంతగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు.

అయితే ఈ చిత్రంలో కరోనా సమయంలో హాస్పిటల్స్ చేసిన దోపిడి, వ్యవహరించిన తీరుని మాత్రం బాగానే చూపించారు. ఈ సినిమాలో చాలా వరకు కరోనా నాటి పరిస్థితులు, అప్పటి వైద్య వ్యవస్థ గురించే చర్చించారు. ఆ పార్ట్ వరకు డెకాయిట్ ఆడియెన్స్‌ని మెప్పించే ప్రయత్నం చేసిందని చెప్పుకోవచ్చు.

ఎలా చేశారంటే?
అడివి శేష్‌ ఈ సారి కాస్త కొత్తగా కనిపించాడు. యాసలోనూ చాలా వరకు మాడ్యులేషన్ చూపించాడు. ఆ యాస వల్లే కొన్ని డైలాగ్స్ కూడా అర్థం కాకపోవచ్చు. లుక్స్, యాక్షన్ పరంగా అడివి శేష్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాడు. ఇక మృణాల్‌కి మరోసారి నటనకు స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. సరస్వతి అలియాస్ జూలియట్‌గా మృణాళ్ ఆడియెన్స్ మరోసారి మెస్మరైజ్ చేస్తుంది. ఇక అనురాగ్ కశ్యప్ పాత్ర ఇంపాక్ట్ చూపిస్తుంది. సునీల్, ప్రకాష్ రాజ్ కారెక్టర్స్ కూడా బాగానే ఉంటాయి. మిగిలిన పాత్రలన్నీ కూడా పరిధి మేరకు ఆకట్టుకుంటాయి.

సాంకేతికంగా సినిమా పర్వాలేదు. భీమ్స్ మ్యూజిక్ సినిమాకు ప్లస్‌ అనే చెప్పాలి. ఆర్ఆర్ సైతం సరికొత్తగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అయితే విజువల్స్ గురించి చెప్పుకోవాలి. కెమెరా వర్క్ టాప్ నాచ్‌లో ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా అనిపిస్తాయి. ప్రతీ పైసాకి తగ్గ వర్క్ తెరపై కనిపిస్తుంది.

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement