కరోనా సమర్పణ.. కన్నీటి చిత్రం

Covid 19 Effect Artists Challenges To Earn Money Ground Report - Sakshi

లాక్‌డౌన్‌తో చితికిన సినీ బతుకులు

షూటింగ్‌లు లేక ఆకలి కేకలు

చిరు వ్యాపారాలు చేసుకుంటున్న సినీ కార్మికులు

సాక్షి గ్రౌండ్‌ రిపోర్టు

అవలీలగా నటించగలరు. కానీ, జీవించడమే వారికి కష్టతరమవుతోంది. రంగుల ప్రపంచంలో గడిపినవారి ముందు ఇప్పుడు అంతా చీకటి ఆవరించింది. రకరకాల పాత్రల్లో నవ్వులు పండించినవారి ముఖాల్లో దిగులు కనిపిస్తోంది. వెండితెరపై వెలిగినవారిప్పుడు కరోనా కష్టాల్లో నలిగిపోతున్నారు. లైట్‌బాయ్స్, కెమెరా అసిస్టెంట్లు, సహాయ దర్శకులు, కో డైరెక్టర్లు, ప్రొడక్షన్‌ అసిస్టెంట్లు, మేకప్‌మెన్, జూనియర్‌ ఆర్టిస్ట్‌లు, క్రేన్‌ బాయ్స్, డ్యాన్సర్లు, డ్రైవర్లు ఇలా చెప్పుకుంటూ పోతే సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌లోని కార్మికులందరూ రోడ్డున పడ్డారు. ఎడిటింగ్, గ్రాఫిక్స్, మ్యూజిక్, సౌండ్‌ ఇంజనీర్లు ఇలా.. ప్రతి ఒక్కరూ పనుల్లేక అవస్థలు పడుతున్నారు.

కృష్ణానగర్, ఫిలింనగర్, ఇందిరానగర్, రహమత్‌నగర్, చిత్రపురికాలనిలో 24 క్రాఫ్ట్స్‌లో పనిచేస్తున్న వారి సంఖ్య సుమారు 24 వేలు. పరోక్షంగా ఇంకో 75 వేల మంది పనిచేస్తుంటారు. జూనియర్‌ ఆర్టిస్ట్‌లు, మిగతా సినీ కార్మికులు ఏవేవో చిన్నా, చితక పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. కరోనా వారి బతుకులను ఎలా అతలాకుతలం చేసిందో తెలుసుకుందామని కొంతమందిని ‘సాక్షి’పలకరించింది.  
– బంజారాహిల్స్‌ 

ఈ చిత్రంలో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు ఎన్‌.మహేష్‌కుమార్‌. స్టిక్కర్లతో ఫిలింనగర్‌ రోడ్లపై కనిపించాడు. సాక్షి ప్రతినిధి స్టిక్కర్లు బేరమాడుతూ మాట కలిపారు. కదిలిస్తే కన్నీటి పర్యంతమయ్యాడు. ‘మా స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు. వెండితెరపై వెలిగిపోవాలన్న మోజుతో 38 ఏళ్ల క్రితం మద్రాస్‌కు రైలెక్కా. చిత్రపరిశ్రమ మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చాక ఫిలింనగర్‌కు మకాం మార్చా. జూనియర్‌ ఆర్టిస్ట్‌గానే బతుకు వెళ్లదీస్తున్నా. ఈ ఏడాది మార్చిలో కరోనా మహమ్మారి సినిమా బతుకుల్ని బజారుపాల్జేసింది. షూటింగ్‌లు లేక రోడ్డున పడ్డా. తిండికి తిప్పలు పడుతున్నా. ఇంటి కిరాయి కట్టలేక ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్నా. స్టిక్కర్లు అమ్ముకుంటున్నా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఉబికి వచ్చిన కన్నీటిని ఒక చేత ఒత్తుకుంటూ, అడుగులో అడుగేసుకుంటూ ముందుకెళ్లిపోయాడు. మరి, ఎన్ని స్టిక్కర్లు అమ్మితే.. లెక్కలేనన్ని అతడి గతుకుల బతుకు అతుకుతుందో ఏమో! (చదవండి: ముంబైలో తెలుగు సీరియల్‌ నటి అరెస్టు)

మంచిరోజుల కోసం ఎదురుచూస్తున్నా... 
నాది తెనాలి. 30 ఏళ్ల క్రితం సినిమాలపై మోజుతో మద్రాస్‌ వెళ్లా. చిత్రపరిశ్రమ హైదరాబాద్‌ తరలివచ్చాక 20 ఏళ్లుగా కృష్ణానగర్‌లోనే ఉంటూ జూనియర్‌ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నాను. షూటింగ్‌ ఉన్ననాడే కడుపుకింత తిండి. గత మార్చి నుంచి షూటింగ్‌లు ఆగడం మాకు శాపమైంది. ఫలితంగా ఫుట్‌పాత్‌పై పడ్డాను. జూనియర్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ కార్యాలయం దగ్గరే పడుకుంటూ ఇక్కడే కాలం గడుపుతున్నాను. మంచిరోజుల కోసం ఎదురుచూస్తున్నా.  
– జూనియర్‌ ఆర్టిస్ట్‌ కొండల్‌రావు 

మాస్కులు అమ్ముకుంటున్న ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌ 
కృష్ణానగర్‌ వీధుల్లో మాస్కులు, శానిటైజర్లు అమ్ముకుంటున్న ఓ వ్యక్తిని ‘సాక్షి’ పలకరించింది. పేరు శివకుమార్‌. నల్లగొండ జిల్లావాసి. కృష్ణానగర్‌లో ఉంటూ 20 ఏళ్లుగా సినిమాలకు ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. సినిమా షూటింగ్‌లప్పుడు ఉన్నంతలో ఎంతోకొంత వెలిగిపోయిన శివ.. కరోనా కారణంగా ఇప్పుడు కష్టాల్లో నలిగిపోతున్నాడు. ‘నాలుగు రాళ్లు వెనుకేసుకునే పరిస్థితిలేక ఇంటి కిరాయి కూడా కట్టలేకపోతున్నా. భార్యాపిల్లల పొట్టనింపడానికి తప్పనిసరి పరిస్థితుల్లో మాస్కులు, శానిటైజర్లు అమ్ముకుంటున్నా. సినిమాలు మళ్లీ ఎప్పుడు మొదలవుతాయా.. మళ్లీ బతుకు ఎప్పుడు గాడిన పడుతుందా.. అని ఎదురుచూస్తున్నా’అని ఎంతో ఆశగా చెప్పాడు. ఎన్ని మాస్కులు అమ్మితే.. కరోనా ముసుగు కమ్ముకున్న అతడి జీవితంలో ఆనందానికి తెరతీస్తుందో కదా.

అప్పులు చేసి కిరాయిలు కడుతున్నాం... 
కరోనా మహమ్మారి సినిమా బతుకుల్ని రోడ్డుకీడ్చింది. కుటుంబ పోషణకు నెలకు రూ.30 వేల ఖర్చు. ఈ 8 నెలల్లో పనిలేక అప్పులు చేసి కిరాయిలు కడుతున్నాం. కొంతమంది ఇక్కడ బతకలేక స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఓ చిన్నసినిమా మొదలైతే 70 మందికి, పెద్ద సినిమా మొదలైతే 100 మందికి పని దొరుకుతుంది. 45 ఏళ్ల నా సినీసర్వీసులో ఇంత ఘోరమైన పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. –  సినీ దర్శకుడు విజయసారథి 

రియల్‌ ఎస్టేట్‌లోకి దిగిన గౌస్‌
ఆయన పేరు ఎండీ గౌస్‌. పేరుకు జూనియర్‌ ఆర్టిస్టు. కానీ, అందరి కంటే చాలా సీనియర్‌. 1982 నుంచి జూనియర్‌ ఆర్టిస్ట్‌గా మంచి మంచి పాత్రలు పోషించాడు. షూటింగ్‌లకు కరోనా బ్రేకులు వేయడంతో ఆయన జీవితం కుదుపులకు గురైంది. దీంతో రియల్‌ ఎస్టేట్‌ వైపు దృష్టి సారించాడు. ప్లాట్లు అమ్మేవారికి, కొనేవారికి మధ్య వర్తిగా పనిచేస్తూ ఎంతోకొంత సంపాదిస్తూ రోజులు నెట్టుకొస్తున్నాడు.  

మెల్లమెల్లగా షూటింగ్‌లు 
గత 3 వారాల నుంచి సినిమా షూటింగ్‌లు మెల్లమెల్లగా మొదలవుతున్నాయి. ఊర్లకు వెళ్లిన వారికి మెసేజ్‌లు పంపి రావాల్సిందిగా సూచిస్తున్నారు. ఇంకో నెలరోజుల్లో పూర్తి స్థాయిలో షూటింగ్‌లు ప్రారంభమవుతాయని ఆశాభావంతో ఉన్నాం. సినీపరిశ్రమలోని కార్మికులను ఆదుకోవడానికి కొంతమంది ముందుకు వచ్చారు. కరోనా కష్టకాలంలో.. మెగాస్టార్‌ చిరంజీవి సీసీసీ పథకంలో భాగంగా 1,500 మంది జూనియర్‌ ఆర్టిస్టులకు మూడు నెలలపాటు బియ్యం, నిత్యావసరాలను పంపిణీ చేశారు. చదలవాడ లాంటి ప్రముఖులు రూ.3 లక్షల మేర నగదు ఇవ్వగా కార్మికులకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేశారు.  -డి.స్వామిగౌడ్, అధ్యక్షుడు, తెలుగు సినీ జూనియర్‌ ఆర్టిస్ట్‌ యూనియన్‌ 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top