Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ | Sakshi
Sakshi News home page

Bramayugam Review: ‘భ్రమయుగం’ మూవీ రివ్యూ

Published Fri, Feb 23 2024 1:47 PM

Bramayugam Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: భ్రమయుగం
నటీనటులు: మమ్ముట్టి, అర్జున్ అశోకన్,సిద్ధార్థ్ భరతన్
నిర్మాతలు: చక్రవర్తి రామచంద్ర & ఎస్.శశికాంత్
తెలుగు విడుదల:సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
దర్శకత్వం: రాహుల్ సదాశివన్ 
సంగీతం: క్రిస్టో జేవియర్
సినిమాటోగ్రఫీ: షఫీక్‌ మహమ్మాద్‌ అలీ
విడుదల తేది: 23 ఫిబ్రవరి 2024(తెలుగు)

‘భ్రమయుగం’ కథేంటంటే..
తక్కువ కులానికి చెందిన దేవన్‌(అర్జున్‌ అశోకన్‌) మంచి గాయకుడు. తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ తప్పిపోతాడు. గ్రామానికి వెళ్లే దారి తెలియక అడవిలో తిరిరి తిరిగి ఓ పాడుబడ్డ భవనంలోకి వెళ్తాడు. అందులో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు వంటవాడు (సిద్ధార్థ్‌ భరతన్‌), మరొకరు యజవానమి కుడుమన్‌ పొట్టి(మమ్ముట్టి). దేవన్‌కి కుడిమన్‌ పొట్టి సాదరంగా ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. తక్కువ కులం వాడు అని తెలిసినా కూడా ఇంటికి వచ్చిన అతిథి అని తనతో సమానంగా చూడాలని వంట మనిషికి ఆదేశిస్తాడు.

అయితే అక్కడ జరిగిన కొన్ని పరిణామాల కారణంగా దేవన్‌ ఆ భవనం నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. అసలు కుడిమన్‌ పొట్టి ఎవరు? పాడుబడ్డ భవనంలో ఎందుకు ఉంటున్నాడు. అతని గురించి అన్నీ తెలిసినా వంటమనిషి ఆ ఇంట్లోనే ఎందుకు ఉన్నాడు? దేవన్‌ని బంధీగా ఎందుకు మార్చారు? చివరకు ఆ ఇంటి నుంచి దేవన్‌ తప్పించుకున్నాడా లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో భ్రమయుగం చూడాల్సిందే. 

ఎలా ఉందంటే..
ప్రయోగాలు చేయడంలో మమ్ముట్టి ఎప్పుడూ ముందుంటారు. మెగాస్టార్‌  అనే ఇమేజ్‌ని పక్కకి పెట్టి కంటెంట్‌ ఓరియెంటెడ్‌ మూవీస్‌ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. భ్రమయుగం కూడా మరో ప్రయోగాత్మక చిత్రమే. ఒక్క చిన్న పాయింట్‌తో రెండున్నర గంటల పాటు కథను నడిపించడం మాములు విషయం కాదు. దర్శకుడు రాహుల్ సదాశివన్ ఆ విషయంలో వందశాతం సక్సెస్‌ అయ్యాడు. సినిమా మొత్తం కేవలం మూడు పాత్రల చుట్టే తిప్పుతూ ఆడియన్స్‌ని సీట్ల నుంచి కదలకుండా చేశాడు. సినిమా మొత్తం బ్లాక్‌ అండ్‌ వైట్‌లో తెరకెక్కించి మెప్పించాడు. మమ్ముట్టి నటన.. క్రిస్టో జేవియర్ బీజీఎం సినిమా స్థాయిని పెంచేసింది.

కథగా చూస్తే భ్రమయుగంలో కొత్తగా ఏమి ఉండడు. పాడుబడ్డ భవంతిలో ఓ మాంత్రికుడు..అతని చేతిలో బంధి అయినా ఓ ఇద్దరి వ్యక్తుల కథే ఇది. పాయింట్‌ చిన్నదే అయినా.. దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు.. వాటిని మలిచిన తీరు అద్బుతంగా ఉంది. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని సినిమా చివరి వరకు కొనసాగించాడు. సినిమాలో హార్రర్‌ ఎలిమెంట్స్‌ ఉన్నా అంతగా భయపెట్టవు.

థ్రిల్లర్‌ ఎమిమెంట్స్‌తోనే కథనాన్ని ఆసక్తికరంగా సాగించాడు. సినిమా ప్రారంభం నెమ్మదిగా ఉంటుంది. పాత్రల పరిచయం వరకు కథ స్లోగా సాగుతుంది. పాడుబడ్డ భవన్‌లోకి తేవన్‌ వచ్చిన తర్వాత అక్కడే  చోటు చేసుకునే కొన్ని సంఘటనలు ఉత్కంఠకు గురి చేస్తాయి. ఫస్టాఫ్‌ కొంచెం నెమ్మదిగా సాగినా.. కొన్ని సీన్స్‌ మాత్రం థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. ఇంటర్వెల్‌ సీన్‌ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో కథనం ఉత్కంఠభరితంగా సాగుతుంది. కురియన్‌ పొట్టి ఫ్లాష్‌ బ్యాక్‌.. చేతన్‌ స్టోరీ అవన్నీ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్‌ అయితే అదిరిపోతుంది. సినిమా మొత్తం కాస్త నెమ్మదిగా సాగినా.. భ్రమయుగం ఓ ఢిపరెంట్‌ థ్రిల్లర్‌ మూవీ.  

ఎవరెలా చేశారంటే..
ఈ సినిమాకు ప్రధాన బలం మమ్ముట్టి నటననే. కుడుమన్‌ పొట్టి పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. తెరపై కొత్త మమ్ముట్టిని చూస్తారు. సినిమా మొత్త ఒకే డ్రెస్‌లో కనిపించి తనదైన నటనతో మెప్పించాడు. క్లైమాక్స్‌లో ఆయన నటన అందరిని కట్టిపడేస్తుంది. దేవన్‌ పాత్రకు అర్జున్‌ అశోకన్‌  పూర్తి న్యాయం చేశాడు. సెకండాఫ్‌లో అయితే మమ్ముట్టిలో పోటీపడి నటించాడు. వంట మనిషిగా  సిద్ధార్థ్‌ భరత్‌ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యక్షి పాత్ర ఆసక్తిరేకించినా.. ఆ పాత్ర ప్రాధాన్యత ఏంటో తెరపై సరిగా చూపించలేకపోయారు.

టెక్నికల్‌ పరంగా సినిమా అదరిపోయింది. క్రిస్టో జేవియర్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని అమాంతం పెంచేశాడు. షఫీక్‌ మహమ్మాద్‌ అలీ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మొత్తం బ్లాక్‌ అండ్‌ వైట్‌లో సాగినా.. తెరపై ప్రతి సీన్‌ చాలా అందంగా కనిపించేలా చేశాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:
Advertisement
 
Advertisement
 
Advertisement