
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఫోటోలను అనుమతి లేకుండా పలు వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగిస్తున్నారని వెంటనే వాటిని నిర్మూలించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. అనుమతి లేకుండానే అనేక వెబ్‌సైట్‌లు తన పేరును ఉపయోగించి పలు వస్తువులను విక్రయిస్తున్నాయని ఆమె పేర్కొంది. AI- జనరేటెడ్ ద్వారా తన పోటోలను మార్ఫింగ్ చేసి వీడియోలను కూడా ప్రసారం చేస్తున్నారని ఐశ్వర్య అన్నారు.
ఐశ్వర్య రాయ్ పిటిషన్‌ను జస్టిస్ తేజస్ కరియా నేతృత్వంలోని ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ఐశ్వర్య తరపున హాజరైన సీనియర్ న్యాయవాది సందీప్ సేథి కోర్టులో బలంగానే వాదించారు. ఎటువంటి అనుమతి లేకుండానే ఐశ్వర్య పేరును ఉపయోగించి పలు వస్తువులను అమ్ముతున్న అనేక వెబ్‌సైట్‌ల వివరాలను కోర్టుకు అందించారు. aishwaryaworld.com అనే ఒక వెబ్‌సైట్‌ను సూచిస్తూ.. ఆమె నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే అది "ఐశ్వర్య రాయ్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్" అని చెప్పుకుంటున్నారని సేథి అన్నారు.
ఒకరి లైంగిక కోరికలను తీర్చుకోవడానికి ఆమె పేరు, ఫోటోలు ఉపయోగించబడుతున్నాయని న్యాయవాది సందీప్ సేథి కోర్టులో లేవనెత్తారు. ఒక పెద్దమనిషి ఆమె ఫోటోలను మార్ఫింగ్ చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇది చాలా నీచమైన పని అంటూ న్యాయవాది ఫైర్ అయ్యారు. దీంతో న్యాయస్థానం కూడా ఐశ్వర్యకు అనుకూలంగానే స్పందించింది. వివిధ ప్రయోజనాల కోసం ఆమె చిత్రాలను అనధికారికంగా ఉపయోగిస్తున్న వెబ్‌సైట్‌లపై ఇంజక్షన్ ఆర్డర్లు జారీ చేస్తామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఐశ్వర్య రాయ్ బచ్చన్ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించే URL లింక్‌లను పూర్తిగా తొలగించడానికి తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని జస్టిస్ తేజస్ కరియాతో కూడిన ధర్మాసనం తెలిపింది.