Bigg Boss 5 Telugu: బయటకు వచ్చేసిన పింకీ, ఎప్పటికీ కావాలి మానస్‌ అంటూ ఎమోషనల్‌!

Bigg Boss Telugu 5: Priyanka Singh Gets Emotional After Elimination - Sakshi

బిగ్‌బాస్‌ షో 92వ ఎపిసోడ్‌ హైలైట్స్‌

Bigg Boss Telugu 5, Priyanka Singh Eliminated From BB5 Show: టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున బిగ్‌బాస్‌ స్టేజీపైకి వచ్చీరావడంతోనే హౌస్‌మేట్స్‌తో ఓ వెరైటీ గేమ్‌ ఆడించాడు. బాగా ఫేమస్‌ అయిన పాత్రలు స్క్రీన్‌పై చూపించి అది ఎవరికి సెట్టవుతుందో చెప్పాలన్నాడు. దీంతో సన్నీ.. మహానటి పాత్ర ప్రియాంకకు పర్ఫెక్ట్‌గా సూటవుతుందన్నాడు. ఇంకొకరిని కంట్రోల్‌లో పెట్టే డా.వశీకరణ్‌ మరెవరో కాదు షణ్నునే అని చెప్పుకొచ్చింది సిరి. అందరినీ డామినేట్‌ చేసే పెదరాయుడు కూడా షణ్నునే అని ఫీలయ్యారు.

నాకు దక్కకపోతే ఇంకెవ్వరికీ దక్కకూడదు అనుకునే నీలాంబరి మాత్రమే కాక వెన్నుపోటు పొడిచే కట్టప్ప, ఫిదాలోని భానుమతి.. ఇవన్నీ పాత్రలూ సిరికే నప్పుతాయని చెప్పుకొచ్చారు. సన్నీకి అర్జున్‌రెడ్డి, చిట్టిబాబు, ఎవరి మాటా వినని సీతయ్య ట్యాగ్‌లిచ్చారు. శ్రీరామ్‌ రేలంగి మావయ్య మాత్రమే కాదని దురదృష్టవంతుడైన మర్యాద రామన్న అని తెలిపారు. శ్రీరామ్‌కు ఎవరు క్లోజ్‌ అయినా బయటకు వెళ్లిపోతారు అని నాగ్‌ అనడంతో అందరూ నిజమేనంటూ నవ్వేశారు. తర్వాత మానస్‌, కాజల్‌ సేఫ్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించాడు.

అనంతరం నాగ్‌ ఇంటిసభ్యులతో లూడో గేమ్‌ ఆడించాడు. ఈ క్రమంలో మానస్‌ పిల్లోతో రొమాన్స్‌ చేయాలని నాగ్‌ ఆదేశించాడు. కానీ ఆచరణలో మానస్‌ విఫలమయ్యాడు. దిండుతో ఎలా రొమాన్స్‌ చేయడమని అతడు ఎదురు ప్రశ్నించగా పోనీ ప్రియాంకతో రొమాన్స్‌ చేస్తావా? అని సూటిగా అడిగేశాడు నాగ్‌. దీంతో షాకైన మానస్‌ వద్దు, దిండే నయమని ఫీలైనప్పటికీ అందరూ పట్టుబట్టి మరీ పింకీతో రొమాన్స్‌ చేయించారు. 

టాప్‌ 7లో ఎవరుంటారని ఊహించలేదని షణ్నుని అడగ్గా అతడు కాజల్‌ పేరు చెప్పాడు. ఈ కాజల్‌ హౌస్‌లో సింపతీ కోసం ప్రయత్నిస్తుందన్నాడు మానస్‌. హౌస్‌లో కామన్‌సెన్స్‌లేని వ్యక్తులు ఇద్దరున్నారని వారెవరో కాదు.. సిరి, పింకీ అని చెప్పుకొచ్చాడు షణ్ను. లూడో గేమ్‌లో సన్నీ, కాజల్‌ గెలిచారు. తర్వాత ప్రియాంక ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించగానే ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. నాతో కొంత ఎక్కువ టైం స్పెండ్‌ చేయాల్సిందని మానస్‌తో చెప్పుకుంటూ బాధపడింది. స్టేజీపైకి వచ్చాక తన జర్నీ చూసుకుని ఏకధాటిగా ఏడ్చింది పింకీ.

ఆమెతో చివరిసారిగా గేమ్‌ ఆడించాడు నాగ్‌. ఇప్పుడున్న టాప్‌ 6 కంటెస్టెంట్లు హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు ఎలాంటి అభిప్రాయం ఉండేది? ఇప్పుడు వారిపై ఎలాంటి అభిప్రాయం ఉందో చెప్పాలన్నాడు. మొదటగా సిరి గురించి చెప్తూ.. ఇదేంటి నాకంటే అందంగా ఉందని అసూయపడ్డాను. కానీ అదెప్పుడూ నా చెల్లెలిగా అనిపిస్తుంది. తను ఈ హౌస్‌కు చాలా అవసరమని నొక్కి చెప్పింది. శ్రీరామ్‌తో ఫస్ట్‌ నుంచి ఇప్పటివరకు తన కనెక్షన్‌ ఒకేలా ఉందని తెలిపింది. శ్రీరామచంద్రను శ్రీకృష్ణుడు చేద్దామనుకున్నా ​కానీ అతడు రాముడిలాగే ఉండిపోయాడంది.

షణ్ను పక్కింటబ్బాయిలా అనిపిస్తాడని, అతడిని తమ్ముడు అని పిలుద్దామనుకున్నాను. కానీ ముదిరిపోయిన బెండకాయ అని తెలిసి ఊరుకున్నానని చెప్పింది. హౌస్‌లో మొదటి రోజు సన్నీ అన్నయ్య నన్ను చూడగానే స్వప్నలోక సుందరి దొరికిందన్నాడు. కానీ నేను అన్నయ్య అని గాలి తీసేశానని నవ్వేసింది. కాజల్‌ చాలా అల్లరి చేస్తుందని చెప్పింది.

బిగ్‌బాస్‌ హౌస్‌లో అడుగుపెట్టినప్పుడు మానస్‌ను చూసి హాయ్‌ చెప్తే అతడు స్పందించలేదు.. ఇతడికి ఎంత పొగరు? అసలు మాట్లాడొద్దనుకున్నాను. కానీ రానురానూ మా మధ్య మంచి ఫ్రెండ్‌షిప్‌ బాండ్‌ కుదిరింది. నీ నుంచి చాలా నేర్చుకున్నాను. నీతో ఫ్రెండ్‌షిప్‌ ఎప్పటికీ కావాలి. నీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నాను? అని పదేపదే అడుగుతుంటావు కదా, నేను నీ విజయాన్ని కోరుకుంటున్నాను అని చెప్తూ ఏడ్చేసింది పింకీ.

ఆమె వెళ్లిపోతున్న బాధను బయటకు కనిపించనీయకుండా జాగ్రత్తపడ్డ మానస్‌.. 'ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో..' అంటూ పాటందుకుని తన భావాలను అభివ్యక్తీకరించాడు. ఐ లవ్యూ నా ప్రాణం పోయినా.. ఐ లవ్యూ నా ఊపిరి ఆగిపోయినా అంటూ పాట రూపంలో ఆమె మీదున్న ప్రేమను ప్రకటించాడు. అంతేకాక ఈ పాటను పింకీకి అంకితమిస్తున్నాననడంతో ఆమె ఆనందభాష్పాలు రాల్చింది. అలాగే సింగర్‌ శ్రీరామ్‌... ప్రియా ప్రియా.. చంపొద్దే అంటూ పింకీ కోసం సాంగ్‌ పాడాడు. అనంతరం ప్రియాంక భారమైన హృదయంతో అందరి దగ్గరా వీడ్కోలు తీసుకుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top