
మాతృత్వాన్ని కోరుకోని మహిళ ఉంటుందా? ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఓ వయసు దాటాక తల్లి కావాలని కోరుకుంటుంది. కన్నడ నటి భావన రామన్న (Bhavana Ramanna) కూడా అదే ఆశించింది. అమ్మ అని పిలిపించుకోవాలని ఆశపడింది. 40 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలకు జన్మనివ్వబోతోంది. ఇంతవరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. వివాహానికి దూరంగా ఉన్న ఆమె సింగిల్ మదర్‌గానే పిల్లలను పెంచేందుకు సిద్ధమవుతోంది.
సీమంతంలో అలాంటి ప్రశ్నలు
తాజాగా ఆమె సీమంతం జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు, బంధుమిత్రులు ఈ ఫంక్షన్‌కు హాజరై ఆమెను దీవించారు. అయితే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించినప్పటి నుంచి కొందరు అదేపనిగా అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ ఇబ్బంది పెడుతున్నారంటోంది భావన. ఆమె మాట్లాడుతూ.. నా సీమంతం వేడుక ఎంతో సంతోషంగా జరిగింది. అయితే కొందరు అనవసరమైన ప్రశ్నలు వేయడమే నన్ను షాక్‌కు గురి చేసింది. ఇంకా ఛాన్స్ ఉన్నప్పుడు పెళ్లెందుకు చేసుకోలేదన్నారు.
నా ఇష్టం
మరికొందరేమో పిల్లల్ని దత్తత తీసుకునే అవకాశం ఒకటుంది, మర్చిపోయావా? అని ఎద్దేవా చేశారు. నేను నా జీవితంలో సంతోషకర క్షణాల్ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో ఇలాంటి ప్రశ్నలు ఎవరైనా అడుగుతారా? ఇవే ప్రశ్నలు మగవాడిని అడగ్గలరా? నేను పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉంటాను. అందుకు మీకేంటి అభ్యంతరం? నా జీవితం నా ఇష్టం. సమాజంలో చాలావాటిలో మార్పొచ్చింది.
ఏం చేసినా తప్పే!
కానీ, ఇప్పటికీ మహిళ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. ఏం చేసినా తప్పుపడుతూనే ఉన్నారు. ఈ విషయంలో మార్పు రావాలి. వెనకటి కాలంలో సంతానం లేని మహిళలను పండగలకు, శుభకార్యాలకు దూరంగా ఉంచేవారు. అది చూసి నా మనసు చివుక్కుమనేది. ఐవీఎఫ్ వంటి ఆధునాతన పద్ధతులు.. అలాంటివారిలో ఓ కొత్త ఆశను రేకెత్తిస్తున్నాయి.
నీచమైన కామెంట్లు
దానిపై కూడా విమర్శలా? ప్రతిదాన్నీ తప్పుపట్టడం, నీచమైన కామెంట్లు చేయడం మానండి. ఈ ఆన్‌లైన్ ట్రోలింగ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పుకొచ్చింది. కన్నడలో అనేక సినిమాలు చేసిన భావన రామన్న తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించింది. చివరగా మలయాళంలో ఒట్ట మూవీ చేసింది. తెలుగులో అమ్మాయి నవ్వితే (2001) అనే ఏకైక మూవీలో కనిపించింది.
చదవండి: 'గుడిసెలో జీవితం.. ఇంట్లోకి పాములు..' సూర్య ఎమోషనల్