టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం నటించిన 'K ర్యాంప్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. క సినిమా తర్వాత కిరణ్ మరో హిట్ అందుకున్నాడు. దీంతో కె ర్యాంప్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రంలో నిర్మాత బండ్ల గణేష్తో పాటు సినీ, రాజకీయ నాయకులు అతిథిలుగా వచ్చారు. ఈ క్రమంలో స్టేజీపై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కిరణ్ అబ్బవరాన్ని ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో పోల్చడమే కాకుండా.. విజయ్ దేవరకొండపై పరోక్షంగా పంచ్లు వేశారని తెలుస్తోంది.
బండ్ల గణేష్ కామెంట్లు ఎవరిపై..
'K ర్యాంప్' సినిమా సక్సెస్ ఈవెంట్లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ' ఈ రోజుల్లో ఒక్క సినిమా హిట్ కాగానే లూజు పేంట్లు, కొత్త కొత్త చెప్పులు, కళ్లకు అద్దాలు పెట్టుకుని ఆపై కాలు మీద కాలు వేసుకుని వాట్సప్.. వాట్సప్ అంటూ తన తర్వాతి సినిమా కోసం లోకేష్ కనగరాజ్ను తీసుకురా... రాజమౌళిని తీసుకురా... సుకుమార్ను తీసుకురా... అనీల్ రావిపూడిని తీసుకురా అంటున్న ఈ రోజుల్లో ఆరుగురు కొత్త దర్శకులను కిరణ్ పరిచయం చేశాడు. ' అని బండ్ల అన్నారు. ఇప్పటివరకు కిరణ్ చేసిన ప్రతి సినిమా కూడా కొత్త డైరెక్టర్తోనే చేశాడని గుర్తుచేశాడు.
చిరంజీవిని ఆదర్శంగా తీసుకో
కిరణ్ అబ్బవరంను మెగాస్టార్ చిరంజీవితో బండ్ల గణేష్ పోల్చారు. తనపై ప్రశంసల వర్షం కురిపించారు. కిరణ్ ఒక రియల్ కుర్రోడు. బాంచెన్ హీరో అంటే ఇలాగే ఉండాలి. ప్రస్తుతం కిరణ్ని చూస్తుంటే నాకు చిరంజీవినే గుర్తొస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో చిరంజీవి కూడా ఇలాగే ఉండేవారు. ఆయన ఇప్పటికే 150 సినిమాలు పూర్తి చేసి.. త్వరలో భారతరత్న అందుకోబోతున్నారు. అయినప్పటికీ చిరంజీవి లాంటి వ్యక్తి కూడా గ్రౌండ్ మీద ఉంటాడు. నువ్వు (కిరణ్) చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్లు.. నిన్ను చూస్తేంటే చాలా ముచ్చటేస్తుంది. అంటూ పొగడ్తలతో ముచ్చేత్తారు.
రౌడీ బాయ్స్ను టార్గెట్ చేసిన బండ్ల
సినిమా పరిశ్రమలో విజయ్ దేవరకొండ మాత్రమే ఎక్కువగా 'వాట్సాప్ వాట్సాప్ మై రౌడీ బాయ్స్' అంటూ తన ఫ్యాన్స్ను పలకరిస్తుంటాడు. ఇప్పుడు బండ్ల గణేష్ కూడా ఇదే ఆటిట్యూడ్తో విజయ్ పేరు ఎత్తకుండా పరోక్షంగా పంచ్లు వేశారని సోషల్మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఒక హీరోను పొగిడేందుకు మరో నటుడిని కించపరచేలా ఈ వ్యాఖ్యలు ఏంటి అంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు.
ఆ మధ్య లిటిల్ హార్ట్స్ ఈవెంట్లో మాట్లాడుతూ ఇండస్ట్రీలో పెద్దలు సెలబ్రిటీలు చేసే పొగడ్తలు నమ్మవద్దు, అన్నీ అబద్దాలే అంటూ నటుడు మౌళికి హితబోధ చేసి ఇప్పుడు ఈ భజన అవసరమా అంటూ బండ్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, గణేష్ అన్నది నిజంగా విజయ్ దేవరకొండనేనా కాదా అనేది పక్కన పెడితే కిరణ్‌ని పొగిడే క్రమంలో మరొకరి ప్రస్తావన ఎందుకనే ప్రశ్న ఇక్కడ ప్రధాన అంశంగా మారింది.


