
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం బాహుబలి. భారతీయ సినీ చరిత్రలోనే అనేక రికార్డులను ఈ చిత్రం సృష్టించింది. తొలిభాగం 2015 జులై 10న విడుదలైంది. రెండోది 2017లో విడుదలైన సంగతి తెలిసిందే. సరిగ్గా నేటితో పదేళ్లు బాహుబలి పూర్తి చేసుకున్నాడు. బాహుబలిగా ప్రభాస్, భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, శివగామిగా రమ్యకృష్ణ, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్ ఈ చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ పాత్రల పేర్లు ఇప్పటికీ ప్రత్యేకంగానే ఉంటాయి. ఎం.ఎం.కీరవాణి సంగీతం ఈ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. విజయేంద్రప్రసాద్ కథ అందించారు.
దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'బాహుబలి: ది బిగినింగ్' చిత్రం విడుదల తర్వాత తెలుగు పరిశ్రమ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఆర్క మీడియా వర్క్స్ పతాకంపై ఈ సినిమాను శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ రూ. 180 కోట్లకు పైగా బడ్జెట్తో నిర్మించగా బాక్సాఫీస్ వద్ద రూ. 650 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.

బాహుబలికి మూలం
'అమరేంద్ర బాహుబలి పాత్రను రామాయణం నుంచి తీసుకున్నదేనిని ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి చెప్పారు. శ్రీ రాముడిలో ఉండే లక్షణాలు బాహుబలి పాత్రలో కనిపిస్తాయన్నారు. రామాయణం గురించి తెలుసుకుంటే రాముడు పాత్ర చాలా వినయం విధేయంగా ఉంటుంది. ఎప్పుడూ కూడా ఆవేశంగా మాట్లాడరు. ఎప్పుడో ఒకసారి మాట్లాడినా దాని వెనుక పెద్ద ప్రళయమే ఉంటుంది. ఆయన పెద్దలు చెప్పింది వింటూ తన పనులు చేసుకుంటూ వెళ్లిపోతాడు. అంత బలంగా రాముడి చరిత్ర మనకు చెబుతుంది.
భారత్లో కృష్ణుడికి ఒక గుడి ఉంటే.. 50కి పైగా రాముడి ఆలయాలు ఉంటాయి. పొరపాటున రాముడిని ఏమైనా అంటే భారతీయులు ఎంతమాత్రం సహించరు. ప్రతి ఒక్కరిలో ఆవేశం పొంగుకుని వస్తుంది. అంతలా భక్తితో ఆయన్ను ఆరాధిస్తారు. అంత భక్తిభావన ఎందుకు ఉంది అని ఆలోచించా.. రాముడి గురించి తెలుసుకున్న తర్వాతే బాహుబలి పాత్రను తెరపైకి తీసుకొచ్చాను.' అని రాజమౌళి అన్నారు.

'వాల్మీకి రామాయణం రాసినప్పుడు రాముడితో పాటు మరికొన్ని పవర్ఫుల్ పాత్రలు ఉంటాయి. హనుమంతుడు, లక్ష్మణుడు వంటి పాత్రలను కూడా రామాయణంలో చాలా బలంగా రాశారు. అయితే, వారు రాముడి కోసం ప్రాణాలు ఇచ్చేందుకు అయినా రెడీగా ఉంటారు. అలా డైరెక్ట్ హీరోయిజం కాకుండా అప్లయిడ్ హీరోయిజాన్ని రాముడి పట్ల వాల్మీకి చూపించారని నాకు అనిపించింది. అందుకే అమరేంద్ర బాహుబలి పాత్ర రాముడిలా కనిపిస్తుంది. కట్టప్ప, శివగామి, దేవసేన వంటి పాత్రలు బాహుబలిని దేవుడు అంటాయి.' అన్నారు.
బాహుబలి విశేషాలు
జాతీయ ఉత్తమ చిత్రంగా, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రంగా రెండు అవార్డులను బాహుబలి -1 అందుకుంది.
బాహుబలి-1 మూవీ 14 నంది అవార్డ్స్‌ను దక్కించుకుంది.
బాహుబలి -2 సినిమాకు 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో మూడు విభాగాల్లో నేషనల్ అవార్డులు గెలుచుకుంది. (ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం, ఉత్తమ యాక్షన్ చిత్రం)
బాహుబలి- 2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1810 కోట్లు రాబట్టి రెండో స్థానంలో ఉంది.
భారతదేశంలో అత్యంత వసూళ్ళు సాధించిన సినిమాలలో ఒకటిగా ఈ సినిమా పేరొందింది.
ఈ సినిమా కోసం తమిళ రచయిత మదన్ కార్కి “కిలికిలి” లేదా “కిలికి” అనే పేరుతో ఓ కొత్త భాషను రూపొందించారు.
ఈ భాషను 750 పదాలతో, 40 వ్యాకరణ సూత్రాలతో రూపోందించారు
2011లో రాజమౌళి తన తదుపరి సినిమాలో ప్రభాస్ కథానాయకుడిగా నటించనున్నాడని ప్రకటించారు
2013లో ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ని బాహుబలిగా ప్రకటించారు.
శివగామి కోసం మొదట శ్రీదేవితో సంప్రదింపులు జరిపారు. శ్రీదేవి అధిక పారితోషికం కోరడంతో ఆ అవకాశాన్ని రమ్యకృష్ణకు ఇవ్వడం జరిగింది
ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఏడాది పాటు జరిగాయి. అందుకోసం 15,000 స్టొరీ బోర్డు స్కెచ్చులు రూపొందించారు.
ఓ భారతీయ సినిమాకు ఇంతటి ప్రీ ప్రొడక్షన్ పనులు చేయడం ఈ సినిమాకే మొదటిసారి.
ఈ సినిమా చిత్రీకరణ జూలై 6, 2013న కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు రాతి ఉద్యానవనంలో మొదలైంది