దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎందరో అభం శుభం తెలియని మహిళలు, ఆడపిల్లలు, చిన్నారులు అన్యాయానికి గురవుతున్నారు. వీళ్లలో చాలామందికి సరైన న్యాయం దక్కట్లేదు! ఈ అంశంపై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి. అయితే దేశంలో రోజుకి 80 అత్యాచారాలు జరుగుతున్నాయనే కాన్సెప్ట్‌తో తీసిన లేటెస్ట్ హిందీ మూవీ 'అస్సి'. రీసెంట్‌గా జీ5 ఓటీటీలోకి వచ్చిన ఈ హార్డ్ హిట్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా ఎలా ఉంది? అనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)
కథేంటి?
పరిమ (కని కుస్రుతి) స్కూల్ టీచర్. భర్త, కొడుకుతో కలిసి సంతోషంగా బతుకుతుంటుంది. ఓ రోజు స్కూల్‌లో ఆలస్యమై, ఇంటికొస్తుంటుంది. కానీ దారిలో ఈమెపై ఐదుగురు యువకులు దారుణానికి తెగబడతారు. కారులో ఎక్కించుకుని ఊరంతా తిప్పుతూ అత్యాచారం చేస్తారు. చివరకు అపస్మారక స్థితిలో ఉన్న ఈమెని రైల్వే ట్రాక్‌పై పడేస్తారు. తర్వాత ఏమైంది? పరిమకు న్యాయం దక్కిందా? ఈమె తరఫున వాదించిన లాయర్ రావి(తాప్సి)కి ఈ కేసు విచారణ సందర్భంగా ఎదురైన అనుభవాలేంటి? అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
అస్సి అంటే హిందీలో ఎనభై(80) అని అర్థం. అంటే మన దేశంలో రోజుకు దాదాపుగా 80 వరకు అత్యాచారాలు జరుగుతున్నాయని ఈ సినిమాతో దర్శకుడు అనుభవ్ సిన్హా చెప్పే ప్రయత్నం చేశాడు. ఇందులో కళ్లు చెదిరిపోయే ట్విస్టులు ఉండవు. అద్భుతమైన విజువల్స్ కనిపించవు. కానీ చూస్తున్నంతసేపు మన పక్కనే జరిగినట్లు అనిపించే కథ, అంతా అయిపోయిన తర్వాత మనసుని బరువెక్కించే కథనం ఇందులో ఉంటుంది.
కథ పరంగా చూస్తే రెగ్యులర్ రొటీన్ కోర్ట్ రూమ్ డ్రామాలానే అనిపిస్తుంది. కొత్తగా ఏముందా అనే సందేహం కలుగుతుంది. కానీ తరచి చూస్తే ఎన్నో విషయాలు అర్థమవుతాయి. మొదలైన ఐదు నిమిషాలకే స్టోరీలోకి వెళ్లిపోతాం. అక్కడి నుంచి తర్వాత ఏమవుతుందా? నిందితులకు శిక్ష పడుతుందా లేదా అనేది చివరి వరకు ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. అత్యాచారానికి గురైన వాళ్లకు నిజమైన న్యాయం దక్కుతుందా? అసలు ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాలనే ఆలోచన ఎవరికైనా ఎందుకొస్తుంది? అనే ప్రశ్నలు ప్రేక్షకులకే వేసినట్లు అనిపిస్తుంది.
పోలీసులు, లాయర్లు కుమ్మక్కై.. కొన్ని కొన్ని కేసుల్ని, అందులో సాక్ష్యాలని ఎలా తారుమారు చేస్తారనే విషయాన్ని అద్భుతంగా చూపించారు. అత్యాచారం సీన్ చూస్తున్నప్పుడు అసభ్యత ఎక్కడా కనిపించదు గానీ ఓ రకమైన భయం కలుగుతుంది. ఒకవేళ మన ఇంట్లోని ఆడవాళ్లకు ఇలా జరిగితే ఎలా? అని మనసులో అలజడి రేగుతుంది.
ఈ సినిమాలో చూడటానికి కొన్ని సీన్స్ సాధారణంగా అనిపిస్తాయి గానీ వాటి మర్మం తెలిసినప్పుడు చిన్నపాటి షాక్ తగులుతుంది. అత్యాచారానికి గురై, కొన్నిరోజుల తర్వాత కోలుకున్న పరిమ.. తిరిగి టీచర్ ఉద్యోగంలో చేరతానని చెప్పినప్పుడు.. విద్యార్థుల గురించి స్కూల్ ప్రిన్సిపల్, పరిమ మధ్య జరిగే సంభాషణ ఒళ్లు గగుర్పొడేలా చేస్తుంది. నేటి సమాజంలో కొందరు టీనేజీ పిల్లలు ఎంత దారుణంగా తయారయ్యారో చెప్పకనే చెబుతుంది.
సినిమాలో ప్రతి 20 నిమిషాలకు ఒకసారి చూపించే రెడ్ స్క్రీన్ గానీ, క్లైమాక్స్‌లో స్కూల్ పిల్లలందరినీ ఎదురుగా కూర్చోబెట్టి జడ్జి, తీర్పు ఇచ్చే సన్నివేశం గానీ బాగుంటాయి. పరిమ కొడుకు పాత్ర అయితే ఇంకా హైలైట్. తల్లిని ఆస్పత్రిలో చేర్చిన దగ్గర నుంచి కోర్టులో వాదనల వరకు ప్రతి విషయాన్ని ఈ పిల్లాడు గమనిస్తుంటాడు. చిన్నతనం నుంచే ఇలాంటివి చూస్తూ పెరిగితే.. పెద్దయ్యాక ఎలాంటి సమస్యని అయినా ఎదుర్కోగల సత్తా పిల్లలకు డెవలప్ అవుతుందని ఈ సీన్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారనిపిస్తుంది.

మన ఇంటిలోని ఆడవాళ్లకు ఏదైనా జరగరానిది జరిగితే ఎలా తోడుగా నిలబడాలి? ఎంత కేరింగ్‌గా చూసుకోవాలి అనే విషయాన్ని పరిమ భర్త పాత్రతో అద్భుతంగా చూపించారు. సరైన భద్రత లేని మన దేశంలో ప్రతి ఒక్కరూ ఎంత జాగ్రత్తగా ఉండటం ముఖ్యమో ఈ సినిమాతో పరోక్షంగా హెచ్చరించారు. డబ్బున్న వ్యక్తుల కొడుకులు చాలామంది ఎలా తయారవుతున్నారు? ఇలాంటి వాళ్ల వల్ల సగటు మహిళలు, ఆడపిల్లలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని కూడా చూపించారు. అయితే ఇలాంటి సున్నితమైన అంశం ఆధారంగా సినిమాలు తీయడం కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే ఎవరు మంచి? ఎవరు చెడు? అని మనం నిర్థారించలేం. దాన్ని కూడా దర్శకుడు చక్కగా బ్యాలెన్సింగ్ చేశాడు. ఇక క్లైమాక్స్‌లో ఓ చిన్న పాప చెప్పే సాక్ష‍్యంతో మొత్తం కేసు తీరే మారిపోతుంది. సినిమా మొత్తంలో ఇదే హైలైట్ సీన్.
ఎవరెలా చేశారు?
లాయర్‌గా తాప్సి సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మిగతా పాత్రధారులు కూడా బాగా చేశారు. పరిమి పాత్రలో అత్యాచారానికి గురైన మహిళగా చేసిన కని కుస్రుతి అయితే అద్భుతంగా నటించింది. రైల్వే ట్రాక్‌పై అపస్మారక స్థితిలో పడున్నప్పుడు గానీ, కోలుకున్న తర్వాత ట్రామా అనుభవించే సీన్స్ చూస్తున్నప్పుడు నిజంగా జరిగిందేమో అనిపించేలా ఉంటుంది. సాంకేతికంగానూ సినిమా బాగుంది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా కచ్చితంగా చూడాలి. ఎందుకంటే చాలా విషయాలు తెలుస్తాయి.
- చందు డొంకాన
(ఇదీ చదవండి: ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తున్న థ్రిల్లర్'సంభవం అధ్యాయం ఒన్ను' తెలుగు రివ్యూ)


