Anni Manchi Sakunamule Telugu Movie Review And Rating - Sakshi
Sakshi News home page

Anni Manchi Sakunamule Review: ‘అన్నీ మంచి శకునములే’మూవీ రివ్యూ

Published Thu, May 18 2023 12:54 PM

Anni Manchi Sakunamule Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: అన్నీ మంచి శకునములే
నటీనటులు: సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌, నరేశ్‌, రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేశ్‌, షావుకారు జానకి, గౌతమి, వాసుకి, వెన్నెల కిశోర్‌ తదితరులు
నిర్మాణ సంస్థలు:  స్వప్న సినిమాస్‌,  మిత్ర విందా మూవీస్‌
నిర్మాతలు: స్వప్నాదత్‌, ప్రియాంకా దత్‌
దర్శకత్వం: నందినీ రెడ్డి
సంగీతం: మిక్కీ జే.మేయర్‌
సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి & రిచర్డ్ ప్రసాద్
ఎడిటర్‌: జునైద్‌
విడుదల తేది: మే 18, 2023

టాలీవుడ్‌లో మంచి గుర్తింపు కలిగిన యంగ్‌ హీరోలలో సంతోష్ శోభన్ ఒకరు. పేపర్‌ బాయ్‌, ఏక్‌ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి వంటి సినిమాలతో టాలెంటెడ్‌ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్‌ వద్ద బోల్తా పడ్డాయి. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ నిర్మించిన కళ్యాణం కమనీయం చిత్రం కూడా సంతోష్‌కి సూపర్‌ హిట్‌ని ఇవ్వలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైన హిట్‌ కొట్టాలనే కసితో ఉన్నాడు. టాలెంటెడ్‌ లేడీ డైరెక్టర్‌ నందినీ రెడ్డి దర్శకత్వంలో ‘అన్నీ మంచి శకునములే’అనే చిత్రంలో నటించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌, పాటలకు మంచి స్పందల లభించింది. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాడ్‌గా నిర్వహించడంలో ‘అన్నీ మంచి శకునములే’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? ఈ సినిమాతో అయినా సంతోష్‌ హిట్‌ ట్రాక్‌ ఎక్కడా లేదా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే.. 
ప్రసాద్‌( రాజేంద్ర ప్రసాద్‌), దివాకర్‌(రావు రమేశ్‌) కుటుంబాల మధ్య పాత గొడవలు ఉంటాయి. వీరిద్దరి ముత్తాతలు 1919లో విక్టోరియాపురం అనే గ్రామంలో కాఫీ ఎస్టేట్‌ని ప్రారంభిస్తారు. అక్కడి కాఫీని క్వీన్‌ విక్టోరియా చాలా ఇష్టపడుతుంది. దీంతో ఆ కాఫీ ఎస్టేట్‌ బాగా ఫేమస్‌ అవుతుంది. కొన్నాళ్లకు పంపకాల విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరిగి కోర్టుకెక్కుతారు. ఆ కేసు నాలుగు తరాలుగా నడుస్తూనే ఉంటుంది.

మరోవైపు దివాకర్‌ తమ్ముడు సుధాకర్‌ (నరేశ్‌)కు కొడుకు రిషి(సంతోష్‌ శోభన్‌) పుడతాడు. అదే రోజు అదే ఆస్పత్రిలో ప్రసాద్‌కు మూడో కూతురు ఆర్య(మాళవిక నాయర్‌) జన్మిస్తుంది. అయితే డాక్టర్‌ నిర్లక్ష్యం వల్ల పిల్లలు మారిపోతారు. ప్రసాద్‌ ఇంట్లో రిషి, సుధాకర్‌ ఇంట్లో ఆర్య పెరుగుతారు. వీరిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉంటారు. పెద్దయ్యాక రిషికి ఆర్యపై ఇష్టం పెరుగుతుంది కానీ ఆ విషయం ఆమెతో చెప్పలేకపోతాడు. ఒక్కసారి బిజినెస్‌ విషయంలో ఆర్య, రిషి కలిసి యూరప్‌ వెళ్తారు. అక్కడ ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగి విడిపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? రిషి తన ప్రేమ విషయాన్ని ఆర్యతో చెప్పాడా లేదా?  ఇరు కుటుంబాల మధ్య ఉన్న కోర్టు కేసు ఎలా సాల్వ్‌ అయింది? తమ పిల్లలు మారిపోయారనే విషయం తెలిశాక  అటు ప్రసాద్‌, ఇటు సుధాకర్‌ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు కాఫీ ఎస్టేట్ వివాదానికి ఎలాంటి పరిష్కారం లభించింది? అనేదే మిగతా కథ. 

ఎలా ఉందంటే.. 
ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలకు పెట్టింది పేరు నందినీ రెడ్డి. ఈమె సినిమాల్లో అందరూ మంచి వాళ్లే ఉంటారు. ఓ పెళ్లి సీన్‌తో పాటు క్లైమాక్స్‌లో ఆడియన్స్‌ని ఎమోషనల్‌ చేసేందుకు కొన్ని సన్నివేశాలు పక్కా ఉంటాయి. అన్నీ మంచి శకునములే చిత్రంలోనూ ఇవన్నీ ఉన్నాయి. కానీ కథనం మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రతీ సీన్‌ పాత సినిమాలను గుర్తుకు తెస్తుంది. పైగా స్లో నెరేషన్‌ ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారుతుంది. 

సినిమా ప్రమోషన్స్‌లో నందినీ రెడ్డి..‘ఈ సినిమాలో అవసరం లేని సీన్స్‌ ఒక్కటి కూడా ఉండదు’అని చెప్పారు. కానీ అలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఓల్డ్‌ మూవీస్‌ పాటలకు పెళ్లిలో ఫ్యామిలీ మెంబర్స్‌ స్టెప్పులేయడం.. షావుకారు జానకీకి చెందిన సీన్స్‌.. డాక్టర్‌ మద్యం సేవించే సీన్స్‌.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

రాజేంద్రప్రసాద్‌ సీరియస్‌గా చేసే కామెడీ, వెన్నెల కిశోర్‌ ఫన్‌ సీన్స్‌తో ఫస్టాఫ్‌ పర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌ మొత్తం రోటీన్‌గా సాగడమే కాదు.. చాలా చోట్ల సాగదీతగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలు కూడా సరిగా పండలేదు. సినిమా చివరి 25 నిమిషాల్లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌ మాత్రం హృదయాలను హత్తుకుంటాయి. ఆరిస్టుల నుంచి కావాల్సిన నటనను రాబట్టుకోవడంలో దర్శకురాలు వందశాతం సఫలం అయింది. కానీ కథ,కథనం విషయంలో జాగ్రత్తగా తీసుకొని ఉంటే సినిమా ఫలితం వేరేలా ఉండేది. 

ఎవరెలా చేశారంటే.. 
రిషి పాత్రలో సంతోష్‌ శోభన్‌ ఒదిగిపోయాడు. ఎలాంటి గోల్స్‌ లేకుండా.. తండ్రి చేతిలో తిట్లు తింటూ.. ఫ్యామిలీ కోసం మంచి చేసే క్యారెక్టర్‌ తనది. ఇక అనుకున్నది సాధించే అమ్మాయి ఆర్య పాత్రకు మాళవిక నాయర్‌ న్యాయం చేసింది. రాజేంద్ర ప్రసాద్‌, రావు రమేశ్‌, నరేశ్‌ తమ అనుభవాన్ని తెరపై మరోసారి నిరూపించారు. రాజేంద్ర ప్రసాద్‌ పెద్దమ్మగా షావుకారు జానకి తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక హీరో సోదరిగా నటించిన వాసుకికి గుర్తిండిపోయే సన్నివేశాలేవి లేవు. గౌతమి, వెన్నెల కిశోర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

ఇక సాంకేతిక విషయాలకొస్తే.. మిక్కీ జే.మేయర్‌ నేపథ్య సంగీతం బాగుంది. టైటిల్‌ సాంగ్‌ మినహా మిగతావేవి ఆకట్టుకునేలా లేవు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సన్నివేశాన్ని రిచ్‌గా చూపించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్‌ చేయాల్సింది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement