– అల్లు అరవింద్
‘‘నిర్మాతగా ఎన్నో సినిమాలు చేశాను, చేస్తున్నాను. సినిమాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదించాను. అయితే ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ ద్వారా నేను సంపాదించాలనుకున్నది డబ్బు కాదు... సంతృప్తి. ఒక నిర్మాతగా ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమా నిర్మించానని సంతృప్తిగా ఉంది’’ అని అల్లు అరవింద్ తెలిపారు. రష్మికా మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’.
అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 7న తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘రాహుల్‌లాంటి సున్నితమైన మనసు, కమిటెడ్ పర్సన్ మాత్రమే ‘ది గర్ల్ ఫ్రెండ్’ లాంటి సినిమా రూపొందించగలరు.
మన అక్క, చెల్లి, పిన్నిల మనసుల్లో ఏముంటుంది? ఎలాంటి ఆశలు ఉంటాయి? అనుకుని ఈ మూవీ చూడాలి. రష్మిక ఈ సినిమాలో జీవించేసింది. దీక్షిత్ నటన నచ్చి, మరో సినిమా కోసం అడ్వాన్స్ ఇచ్చాను’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమాలో రష్మిక నటన ఈ దశాబ్దంలో ఒక మహిళా నటి తెలుగులో చేసిన బెస్ట్ పర్ఫార్మెన్స్‌గా నిలుస్తుంది’’ అని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. ఈ సమావేశంలో దీక్షిత్, ధీరజ్, విద్య కొప్పినీడి తదితరులు పాల్గొన్నారు.


